ఖుర్దా రోడ్ మండల కమిటీ సమావేశం
● అధ్యక్షునిగా భర్తృహరి మహతాబ్ ఏకగ్రీవ ఎన్నిక
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం అధికార పరిధికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) మండల కమిటీ సమావేశం సోమవారం భువనేశ్వర్‌లో జరిగింది. ఈ సమావేశంలో తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ సహా పలువురు సీనియర్ రైల్వే అధికారులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను మండల కమిటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ప్రతిపాదించారు.
పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంబిత్ పాత్రో (పూరీ), డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బరంపురం), అనంత నాయక్ (కెంజొహర్), సుకాంత కుమార్ పాణిగ్రాహి (కంధమల్), డాక్టర్ రవీంద్ర నారాయణ్ బెహరా (జాజ్‌పూర్), అవిమన్యు సెఠి (భద్రక్), అనితా శుభదర్శిని (అసికా), రాజ్య సభ సభ్యులు సులతా దేవ్, శుభాశిష్ ఖుంటియా, దేబాశిష్ సామంతరాయ్ సమావేశంలో పాల్గొన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచాలని సభ్యులు ప్రతిపాదించారు. రాష్ట్రం అంతటా రైలు మార్గం అనుసంధానం విస్తరణకు ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. ప్రధాన ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడం, రైలు సేవలను మెరుగుపరచడం మరియు ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ సమావేశంలో తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ప్రసంగిస్తూ జోనల్ స్థాయిలో ప్రయాణీకుల సేవలు, భద్రత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కార్యదక్షతని ఎంపీలకు వివరించారు. ఖుర్దా రోడ్ మండల రైల్వే అధికారి అలోక్ త్రిపాఠి మండలం వ్యాప్తంగా రైలు మార్గాల విస్తరణ తదితర ప్రధాన రంగాల్లో కార్యాచరణ వివరించారు.


