లెక్కింపు పూర్తి.. ఫలితాలు భద్రం
రాయగడ: రాయగడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్ర పండపై 19 మంది కౌన్సిలర్లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సొమవారం నాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయినప్పటికీ ఫలితాలను అధికారులు వెల్లడించలేదు. గత నెల 9 వ తేదీన వైస్ చైర్మన్ శుభ్రా పండపై కౌన్సిలర్లు తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి స్థానిక మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. అయితే కోర్టును ఆశ్రయించిన శుభ్ర పండా తనపై తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఎలాంటి నిజాలు లేవని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టు ఆదేశానుసారం ఫలితాలను వెల్లడించలేదు. దీంతో ఓట్లు వేసిన బాక్స్ ను స్థానిక ట్రెజరీ కార్యాలయంలో అధికారులు భద్రపరిచారు. దీనిపై హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ ఆదేశానుసారం సోమవారం నాడు లెక్కింపు కార్యక్రమం చేపట్టినప్పటికీ ఫలితాలను మాత్రం వెల్లడించకుండా తిరిగి ఆ బాక్స్‌ను జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచారు. సోమవారం నాడు సబ్ కలక్టర్ రమేష్ కుమార్ జెన్న, డీపీఓ తదితరుల సమక్షంలో ఉదయం 11 గంటలకు లెక్కింపు కార్యక్రమం జరిగింది. రాయగడ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉండగా ఇందులో 19 మంది బీజేడీకి చెందిన కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అయితే 24 వార్డు కౌన్సిలర్ల ఓటింగ్ జరిగే సమయంలో కేవలం 21 మంది కౌన్సిలర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.


