96 శాతం ఫిర్యాదులు పరిష్కారం
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం 15వ ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. స్థానిక యూనిట్ 2 గ్రీవెన్స్ సెల్‌లో కెంజొహర్ జిల్లా నివాసితులు తీసుకువచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 8 మంది సీనియర్ క్యాబినెట్ మంత్రులు ఆయనతో పాలుపంచుకుని పీడితులకు ప్రత్యక్షంగా చేరువై ప్రభుత్వం నిబద్ధతను మరింత బలోపేతం చేశారు. ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ వేదికకు ఇప్పటి వరకు దాఖలైన 12,950 ఫిర్యాదుల్లో 12,371 దాదాపు 96 శాతం పరిష్కరించారు. మిగిలిన 579 ఫిర్యాదుల పరిష్కారం ప్రక్రియ చురుకుగా కొనసాగుతుంది. సోమ వారం తెల్లవారు జాము నంచి విచారణ శిబిరం ఆవరణలో వేచి ఉన్న 34 మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను ముఖ్యమంత్రి తొలుత కలిశారు. ఆయన ప్రతి ఒక్కరితోనూ సంభాషించి ఫిర్యాదు పత్రాల్ని సేకరించి సత్వర చర్యలకు అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ మరియు మంత్రులు సురేష్ కుమార్ పూజారి, ముఖేష్ మహాలింగ్, కృష్ణ చంద్ర మహాపాత్రో, బిభూతి భూషణ్ జెనా, ప్రదీప్ బాల్ సామంత్, గణేష్ రామ్ సింగ్ ఖుంటియా మరియు గోకులానంద మల్లిక్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మోహన్ మాఝీ నేతృత్వంలో ఫిర్యాదుల విచారణ వ్యవస్థ పౌరులు తమ సమస్యలను ప్రత్యక్షంగా నివేదించడానికి ఒక వేదికగా విశేష ప్రజాదరణ పొందుతుంది. ప్రధానంగా ఫించన్లు, భూ వివాదాలు, సంక్షేమ ప్రయోజనాలు, ప్రజా సేవలు వంటి అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి సారిస్తుంది.
96 శాతం ఫిర్యాదులు పరిష్కారం


