
కుంభిగుడ, టికిరపడలో ఏనుగుల బీభత్సం
రాయగడ: రాయగడకు సమీపంలో గల కుంభిగుడ, కల్యాణసింగుపూర్ సమితి పరిధిలోని టికిరపడ గ్రామాల్లో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. కుంభిగుడలో గల రైతు దూడల శ్రీనివాస్ ఫార్మ్‌హౌస్‌లో ఉన్న నీటి సరఫరా పరికరాలు పీకి పారేశాయి. అదేవిధంగా పక్కనే గల అరటి చెట్లను నేలమట్టం చేశాయి. టికిరపడలో కొండ ప్రాంతంలో నివసిస్తున్న కేశవ కృషిక, జుమూర్ కుట్రుకలకు చెందిన రెండు ఇళ్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ప్రాణభయంతో రెండు కుటుంబాలకు చెందిన 8 మంది అడవుల గుండా పరుగులు తీశారు. ఇళ్లలోకి చొరబడిన ఏనుగుల గుంపు ఇంటిలో దాచి ఉంచిన బియ్యం, చోలు, జొన్నలు, కందులు తదితర వస్తువులను చెల్లాచెదురు చేశాయి. మంగళవారం రాత్రి దాదాపు 24 ఏనుగులు ఒక్క సారిగా తమ ఇళ్లపై దాడి చేసినట్లు కేశవ తెలియజేశారు. గత కొద్ది రొజులుగా కళ్యాణ సింగుపూర్, కొలనార, రాయగడ తదితర సమితుల్లో ఏనుగుల సంచారం ఎక్కువవుతుండటంతో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బితుకుబితుకుమంటూ జీవిస్తున్నారు.

కుంభిగుడ, టికిరపడలో ఏనుగుల బీభత్సం

కుంభిగుడ, టికిరపడలో ఏనుగుల బీభత్సం

కుంభిగుడ, టికిరపడలో ఏనుగుల బీభత్సం