
గర్భిణికి ప్రసవ కష్టాలు!
● బురద రోడ్డులో నడిచి ఆస్పత్రికి
వెళ్లిన వైనం
జయపురం: నిండు గర్భిణికి ప్రసవ కష్టాలు వెంటాడాయి. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో అంబులెన్స్ గ్రామం వరకూ రాలేని పరిస్థితి నెలకుంది. దీంతో బురదలోనే కిలోమీటర్ నడుచుకుంటూ.. అక్కడ నుంచి ఆస్పత్రికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి మఠపడ పంచాయితీ డెంగాపకన గ్రామానికి చెందిన పవిత్ర కండకిభార్య గోరి కండకి నిండు గర్భిణి. ఆమెకు మంగళవారం ఉదయం పురిటి నొప్పులు మొదలు కావటంతో ఆమె భర్త అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ గ్రామానికి బయలుదేరినప్పటికీ రోడ్డు బురదతో ఉండడంతో ముందుకు కదల్లేదు. గర్భిణి గోరి నొప్పులు తాళలేక పోవటంతో గత్యంతరం లేక ఆమెను పట్టుకొని బురద మార్గంలో దాదాపు కిలోమీటర్ దూరంలో నిలిచి ఉన్న అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు ఆస్పత్రికి చేరిన తరువాత ప్రసవించిందని.. ఒక వేళ మార్గంలో ప్రసవిస్తే పరిస్థితి ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇప్పటికై న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి పక్కా రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.