
పూరీ మరణాలకు బాధ్యులెవరు..?
కొరాపుట్: పూరీలో జరిగిన మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని పీసీసీ డిమాండ్ చేసింది. ఆదివారం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రథయాత్రను బీజేపీ పాలకులు చెడగొట్టారని విమర్శించారు. ఇప్పటికే ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం చెబుతుందన్నారు. కానీ మరో 600 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం పాలకులు మర్చిపోయారన్నారు. అసలు ఈ యాత్రని పర్యవేక్షణ చేస్తున్నదెవరో ప్రజలకు చెప్పాలన్నారు. అనేక సార్లు సమీక్ష జరిపిన తర్వాత ప్రశాంతంగా జరగాల్సిన యాత్ర విషాదంగా మారిందన్నారు. విషయం పై రాజకీయాలు చేయాల్సిన సమయం కానందున తాము సంయయనం వహిస్తున్నామని భక్త చరణ్ దాస్ ప్రకటించారు. అంతకు ముందు కలహండి జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర పరిశీలకుడు అజయ్ కుమార్ లల్లూ తో కలసి నబరంగ్‌పూర్ వచ్చారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకురాలు కాధంబని త్రిపాఠి ఏర్పాటు చేసిన బాధిత మహిళల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం జిల్లా దాటి కొరాపుట్ జిల్లాలోనికి ప్రవేశించారు. జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్కలు ఘనస్వాగతం పలికారు. వందలాది బైక్‌లతో ర్యాలీ చేశారు.