
కొఠియాలో అంగరంగ వైభవంగా రథయాత్ర
కొరాపుట్: ఆంధ్ర–ఒడిశా వివాదాస్పద ప్రాంతంలో అంగరంగ వైభవంగా రథయాత్ర జరిగింది. శనివారం రాష్ట్ర మంత్రి వర్గం భారీగా తరలివచ్చింది. ఈ ప్రాంతం తమదేనని పరోక్షంగా ఆంధ్రాకు సంకేతాలు పంపించింది. ఉదయం ప్రత్యేక విమానంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్దన్ సింగ్ దేవ్, రాష్ట్ర గనుల మంత్రి బిభూతి భూషణ్ జెన్నా, రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి, మత్స్య శాఖ మంత్రి గోకులా నంద నాయక్ జయపూర్‌లో దిగారు. వీరికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో స్వాగతం పలికారు. అనంతరం మంత్రుల బృందం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న జగన్నాథ దేవాలయాన్ని సందర్శించారు. స్థానిక గిరిజనులతో కలసి రథం మీదకు ఎక్కి పూజలు చేశారు. రథాన్ని లాగుతూ యాత్ర కొనసాగించారు. ఇంత వరకు చరిత్రలో ఏనాడూ ఈ స్థాయిలో అధికార యంత్రాంగం కొఠియా రాలేదు. ఈ సారి పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు. బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, కాంగ్రెస్‌కు చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క జత కలిశారు. సీఎల్పీ నాయకుడు రాం చంద్ర ఖడం, ఎమ్మెల్యేలు తారా ప్రసాద్ బాహిణీపతి (జయపూర్), రుపుధర్ బోత్ర(కొట్‌పాడ్), రఘరాం మచ్చో(కొరాపుట్) ఐక్యంగా కొఠియా కోసం సంఘీబావ ప్రకటనలు చేశారు. కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఈ యాత్రలో పాల్గొన్నారు. కొఠియా పరిధిలో 22 గ్రామాల ప్రజలు ఈ యాత్ర లో పాల్గొన్నారు. పోలీసులు భారీగా మోహరించారు.

కొఠియాలో అంగరంగ వైభవంగా రథయాత్ర

కొఠియాలో అంగరంగ వైభవంగా రథయాత్ర