
● సరస్వతీ దేవి అవతారంలో తరతరణి
● దర్శనానికి పోటెత్తిన భక్తులు
చైత్రమాసంలోని అతి ముఖ్యమైన మూడో మంగళవారం సందర్భంగా దక్షిణ ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం, రూశికుల్యా నదీతీరంలో కొండపై కొలువైన తరతరణి అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి సుమారు 6 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొండ దిగువున వంటావార్పు చేసుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారికి మధ్యాహ్నం రాజభోగం, సాయంత్రం సంధ్యా హారతి, రాత్రి బెడా చేపట్టి ప్రత్యేక రథంలో తిరువీధి గావించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఒక డీఎస్పీ స్థాయి అధికారితో పాటు 10 మంది ఎస్‌ఐలు, 100 కానిస్టేబుల్స్ ఉత్సవాలను పర్యవేక్షించినట్లు ఎస్పీ జగ్‌మోహన్ మీనా తెలియజేశారు.
– బరంపురం
విద్యుత్ కాంతుల్లో అమ్మవారి ఆలయం

తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం

పూజలందుకుంటున్న తరతరణి అమ్మవారు

వేకువజామునే అమ్మవారి దర్శనానికి బారులుతీరిన భక్తులు

కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులు