
బాబూమోహన్‌ను సన్మానిస్తున్న రూపేష్ పాణిగ్రహి, కాశీనగర్ చైర్‌పర్సన్ సుధారాణి
● పర్లాకిమిడిలో సందడిగా ఉగాది ఉత్సావాలు ● హాజరైన టాలీవుడ్ సీనియర్ నటులు సుమన్, బాబుమోహన్
పర్లాకిమిడి: టాలీవుడ్ ిసీనియర్ నటులు సుమన్, బాబూమోహన్ రాకతో పర్లాకిమిడి ఉగాది ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనం భారీగా తరలిరావడంతో హైటెక్ ప్లాజా మైదానం కిక్కిరిసింది. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి పాణిగ్రాహి పోటీ చేసిన సమయంలో ప్రచారం నిమిత్తం పర్లాకిమిడి వచ్చానని గుర్తు చేసుకున్నారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో తన జీవిత భాగస్వామి వారించినా.. పాణిగ్రాహితో ఉన్న అనుబంధం తోనే వచ్చానని తెలిపారు. హాస్యనటులు బాబూమోహన్ తాను నటించిన చిత్రాల్లోని పలు డైలాగులను వినిపించి, ప్రేక్షకులను ఆనందింపజేశారు. దివంగత నటి సౌందర్యతో కలిసి డ్యాన్స్ చేసిన ‘చినుకు చినుకు’ పాట పాడి, అలరించారు. అనంతరం ఇరువురు సీనియర్ నటులను జ్ఞాపికలు, దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. అలాగే జబర్దస్త్ నటులు శాంతి స్వరూప్, మోహన్ కామెడీ స్కిట్లతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో బుల్లెట్ భాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, హైటెక్ గ్రూప్స్ ఎండీ రూపేష్ పాణిగ్రాహి సభను విజయవంతం చేయడానికి కృషిచేశారు.