సైబర్‌ సవాల్‌

- - Sakshi

శ్రీకాకుళంక్రైమ్‌: పెళ్లి పేరుతో డబ్బులు పోగొట్టుకు న్నది ఒకరు. జాబ్‌ వస్తుందనే ఆశతో సొమ్ములు ఇచ్చేసింది మరొకరు. లాటరీ ఆనందంలో ఖాతా ఖాళీ చేసుకుంది ఇంకొకరు.. నేరమేదైనా వేదిక మాత్రం ఆన్‌లైనే. సాంకేతికత పెరుగుతూ పనులు సులభమవుతున్న కాలంలో.. అదే సాంకేతికతను అడ్డం పెట్టుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సైబర్‌ నేరాలు పోలీసులకు కూడా సవాల్‌ విసురుతున్నాయి. ఎప్పటికప్పుడు కేసులు పరిష్కరిస్తున్నా.. ఇంకా కొత్త కేసులు నమోదువుతూనే ఉన్నాయి. జనం ఈ సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకుంటేనే మోసాలు తగ్గుతాయని పోలీసులు సూచిస్తున్నారు. 2020 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 154 కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్‌ లోన్‌యాప్స్‌, ఏఈపీఎస్‌ (ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సర్వీస్‌), కష్టమర్‌ కేర్‌ ఫ్రాడ్‌ కేసులకు సంబంధించి రోజుకో ఫిర్యాదు అందుతోందని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు.

ఉద్యోగం పేరుతో..

వర్క్‌ ఫ్రం హోమ్‌ ఆన్‌లైన్‌ జాబ్‌ ఇస్తామంటూ యాడ్‌ లేదా క్లాసిఫైడ్‌ ఆన్‌లైన్‌లో వస్తుంది. ముందుగా రిజిస్ట్రేషన్‌ ఫీజు యూపీఐ ట్రాంజెక్షన్‌ ద్వారా కట్టమంటారు. లేదంటే వారే ఓ లింక్‌ పంపించి క్లిక్‌ చేసి డబ్బులు వేయమంటారు. అక్కడితో ఆగరు. ల్యాప్‌టాప్‌, సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌, అపాయిట్‌మెంట్‌ లెటర్‌ ఖర్చులంటూ దఫదఫాలుగా గుంజేస్తారు. ఇలాంటి ప్రకటనలు చూసినప్పుడు నిజనిర్ధారణ చేసుకోవాలి. అప్పటికప్పుడే ఎవరూ డబ్బులు వేయమని అడగరు. ఇది గుర్తుంచుకోవాలి.

ఓటీపీలు పంపించి..

మీకు ఓటీపీ వచ్చింది. చెప్తే మీకు అమౌంట్‌ వేస్తాం.. లేదంటే మీకొచ్చిన గిఫ్ట్‌ యాక్టివేట్‌ అవుతుంది అంటూ ఆశ పెడతారు. యాక్టివేట్‌ అవ్వాలంటే మీ ఓటీపీ ఓ సారి చెప్పండంటూ ఫోన్‌లు చేస్తారు. ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని బ్యాంకులన్నీ ఎప్పటి నుంచో జాగ్రత్తలు చెబుతున్నాయి. ఆ జాగ్రత్త పాటిస్తే మేలు.

పెళ్లి సంబంధాల మోజులో..

మ్యాట్రిమొనీ సైట్‌ల పేరుతో మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెళ్లి కాని వ్యక్తుల వివరాలు తీసుకుని అమ్మాయి పేరుతో దగ్గరవుతారు. ఏవో అవసరాలు చెప్పి డబ్బులు గుంజేస్తారు. అదును చూసి మాయమైపోతారు. వ్యక్తి ఎవరో తెలియకుండా డబ్బులు వేస్తే మోసపోవడం ఖాయం.

ఇంకా కొన్ని..

● యూపీఐ నగదు బదిలీల పేరుతో కొందరు మన ఎం–పిన్‌, పాస్‌వర్డ్‌, క్యూఆర్‌ కోడ్‌ డీటైల్స్‌ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకూడదు.

● అలాగే బయోమెట్రిక్‌ వేలిముద్రలు వేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ డేటా లీక్‌ కాకుండా చూసుకోవాలి.

● ఏటీఎం సెంటర్లలో పిన్‌ కొట్టేటప్పుడు, లావాదేవీ ఆగిపోయినప్పుడు కార్డ్‌ తీసుకునేటప్పుడు నిశితంగా గమనించాలి. లేదంటే మన కార్డు క్లోనింగ్‌ చేసి మోసం చేసే అవకాశం ఉంటుంది.

● అన్నింటి కంటే పెద్ద మోసం ఆన్‌లైన్‌ లోన్స్‌. ఖాళీగా ఉన్న యువత, నిరుద్యోగులు, డబ్బులు అవసరమైన వారికి ఎర వేసి వారికి అప్పులు ఇచ్చి ఆస్తులు లాగేస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ లోన్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన గ్యాలరీకి అనుమతి తీసుకుని మన ఫొటోలు లాగేసి న్యూడ్‌గా మార్ఫ్‌ చేసి నిలువునా దోచేస్తారు.

కష్టమర్‌ కేర్‌ నుంచి..

ఇప్పుడు మొబైల్‌ నిండా ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌లే. మోసగాళ్లు వాటిని కూడా వాడుకుంటున్నారు. ఫలానా యాప్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ మోసం చేస్తారు. అలాగే వీటికి సంబంధించి నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లూ ఉంటాయి. గూగుల్‌లో వెతికి వాటికి కాల్‌ చేస్తే ఖాతాకు మంగళం పాడేస్తారు.

పెరిగిపోతున్న సైబర్‌ మోసాలు

యువతే టార్గెట్‌

ఎస్పీ చొరవతో కేసులు పరిష్కరిస్తున్న సైబర్‌ పోలీసులు

1930కు ఫిర్యాదు చేయాలని సూచన

లాటరీల మాయ..

మీకు లాటరీ రూ. 2 లక్షలు తగిలిందని మీ మొబైల్‌కు కాల్‌ లేదా మెసేజ్‌ వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్‌, ప్రాసెస్‌ ఫీజు కడితే చాలంటారు. కొరియర్‌లో విలువైన గిఫ్ట్‌ పంపాం, మధ్యలో ఆగింది, మీరు అమౌంట్‌ పంపితే వస్తుందంటారు. ఇలాంటి కేసులు నిత్యం వస్తుంటాయి. ఆన్‌లైన్‌లో మీకు రూ. 30 వేల లోన్‌ వస్తుందంటారు. లింక్‌ క్లిక్‌ చేయమంటారు. ఇలాంటివి నమ్మకూడదు. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ లేకుండా వ్యక్తిగత లోన్‌లు ఎవరూ ఇవ్వరు. విలువైన గిఫ్ట్‌లూ పంపరు. అది ప్రజలు గమనించాలి.

అప్రమత్తంగా ఉండాలి..

ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని, మనీ ఆన్‌లైన్‌లో పోగొట్టుకుంటే తక్షణం 1930కు డయల్‌ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్‌ యాప్‌ల జోలికి పోకూడదని హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వారిని నమ్మడం మానుకోవాలని సూచిస్తున్నారు.మొబైళ్లు పోతే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ మొబైల్‌ ట్రేస్‌ యాప్‌ లాస్ట్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top