
ఉగాది వేడుకలు తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన జనం
రాయగడ: పట్టణంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఒడియా, తెలుగు ప్రజల సమైఖ్యతకు పునాదులుగా నిలిచాయని రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రి జన్నాథ సరక అన్నారు. జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు ఆధ్వర్యంలో ఏటా వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం, వేలాదిగా జనం తరలి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాయగడ వంటి ప్రాంతంలో తెలుగు, ఒడియా ప్రజలు సమైఖ్యంగా ఉత్సవాలను జరుపుకోవడంపై హర్షం వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ మాట్లాడుతూ నెక్కంటి ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు.
సమష్టి కృషితోనే..
జిల్లా తెలుగు ఉగాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఉగాది వేడుకలకు ఇంతమంది జనం తరలిరావడం తనపై ప్రజలకు ఉన్న అభిమానమేనని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు అన్నారు. అందరి సమష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. మన భాషా, సంసృతులను పరిరక్షించేందుకు ఇటువంటి తరహా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతా ఐకమత్యంతో ఉంటే కచ్చితంగా అభివృద్ధి సాధ్యపడుతుందని వివరించారు.
ఉసూరుమనిపించిన వర్షం..
పట్టణంలోని మజ్జిగౌరి మందిరం నుంచి ప్రారంభమైన కలశయాత్ర వేదిక వద్దకు చేరుకునే సరికి సాయంత్రం 7గంటలు దాటింది. ఈ యాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయ భరధ్వాజ్ పాల్గొనడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం హోటల్ తేజస్విని మైదానంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. జబర్దస్త్ కళాకారులు రోహిణి, బాబు, ఇమ్మాన్యేల్, రాంప్రసాద్ చేసిన హాస్య ప్రదర్శనలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. సుమారు 2గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమాలు వరుణుడి రాకతో అంతరాయం ఏర్పడింది. వర్షం కురవడంతో చాలామంది ఉసూరుమంటూ ఇళ్లకు పరుగులు పెట్టారు. కొంతమంది మాత్రం వర్షంలోనే తడుచుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
అవిభక్త కొరాపుట్ జిల్లాల్లో ఘనంగా
ఉగాది ఉత్సవాలు
హాజరైన మంత్రి జగన్నాథ సరక,
ఎమ్మెల్యేలు, అధికారులు
ఆకట్టుకున్న సినీ, టీవీ కళాకారులప్రదర్శనలు
తెలుగు సంఘాల సమన్వయంలో
కీలకంగా వ్యవహరించిన నెక్కంటి

ఉత్సవాలను ప్రారంభిస్తున్న నెక్కంటి భాస్కరరావు, కమిటీ సభ్యులు

వేదికపై మాట్లాడుతున్న కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్, పక్కన మంత్రి సరక, నెక్కంటి

జబర్దస్త్ కళాకారుల నవ్వింపులు

వేదికపై హుషారెత్తిస్తున్న యాంకర్ అనసూయ