
స్పీకర్ పోడియం చుట్టుముట్టిన విపక్షాల సభ్యులు
● మహానది జల వివాదంపై శాసనసభలో రభస ● రోజంతా కార్యక్రమాలకు గండి
భువనేశ్వర్: మహానది జలాల వివాదంపై చర్చతో గురువారం జరిగిన సభా సమావేశాల్లో తీవ్ర అలజడి చోటు చేసుకుంది. ప్రధాన విపక్షం భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీ సభ్యుల దాడితో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో రోజంతా సభా కార్యక్రమాలకు గండి పడింది. సభా సమావేశాలు ఆరంభం కావడంతో ప్రతిపక్ష సభ్యులు మహానది జలాల వివాదం అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయకుడు(సీఎల్‌పీ) నర్సింగ మిశ్రా ప్రశ్నోత్తరాల సమయాన్ని నిలిపివేసి మహానది నది నీటిపై చర్చకు డిమాండ్ చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు బ్యారేజీలు నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో మహానది జలాల నిల్వ అడుగంటి పోయిందన్నారు. ఈ పరిస్థితికి ఉభయ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణమని నర్సింగ మిశ్రా విరుచుకు పడ్డారు. అలాగే మహానదికి సంబంధించిన అన్ని సమస్యలపై చర్చ జరపాలని బీజేపీ సభ్యులు కోరారు. సమస్య పరిష్కారానికి ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సహా సమగ్ర కార్యాచరణని సభలో ప్రవేశ పెట్టాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ప్రత్యేక తీర్మానం ద్వారా మహానది అంశంపై చర్చించాలని కోరారు. వీరి డిమాండ్ పట్ల స్పీకర్ స్పందించక పోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విపక్షాల సభ్యులు పోడియం ప్రాంగణానికి దూసుకు వెళ్లారు. ఈ పరిస్థితుల దృష్ట్యా స్పీకర్ బిక్రమ్‌కేశరి అరూఖ్ సభను వాయిదా వేశారు.
చర్చకు అడగాల్సింది..!
మహానది జలాల వివాదంపై అధికార పార్టీ అసెంబ్లీలో గలాటా సృష్టించింది. ప్రశ్నోత్తరాలను మినహాయించి ఈ అంశంపై చర్చకు అభ్యర్థిస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తుందని సీఎల్‌పీ నాయకుడు నర్సింగ మిశ్రా వ్యాఖ్యానించారు. జలాల పంపిణీ వివాదం పరిష్కరించే సత్తాలేని బలహీన పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం ఊగిసలాడుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సభలో చర్చకు అనుమతిస్తే ప్రభుత్వ బండారం బయట పడుతుందని వెనుకంజ వేస్తుందని దుయ్యబట్టారు. అయితే విపక్షాలు లేవనెత్తిన మహానది జలాల పంపిణీ వివాదంపై సభలో చర్చకు ప్రభుత్వం సుముఖంగానే వ్యవహరిస్తుందని అధికార పక్షం సభ్యుడు మాజీమంత్రి ప్రతాప్ జెనా సభ వెలుపల విలేకరులకు తెలిపారు. విపక్షాల అభ్యర్థన మేరకు జలాల పంపిణీ వివాదంపై సభలో వివరణ ప్రవేశ పెట్టాలని జలవనరుల శాఖ మంత్రికి స్పీకర్ ఆదేశించారని తెలిపారు. ప్రశ్నోత్తరాలకు అంతరాయం లేకుండా వాయిదా తీర్మానం ప్రతిపాదనతో ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయాల్సిందని ఆయన హితవు పలికారు.