విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ప్రతి ఉన్నత విద్యా కళాశాల నాక్ అక్రిడేషన్ స్థాయిని చేరుకోవాలని ఆ దిశగా కళాశాలలను తీర్చిదిద్దాలని ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహన్‌రావు అన్నారు. స్థానిక జెఎన్‌టీయూ గురుజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో గురువారం యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు నిర్వహించిన ‘నాక్ అక్రిడేషన్ ’ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యారంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుకున్న లక్ష్య సాధనలో భాగంగా తొలిత ప్రతి కళాశాల నాక్ అక్రిడేషన్ అర్హతను సాధించే దిశగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కళాశాలలకు అన్ని సౌకర్యాలు మరియు కావాల్సిన క్వాలిటీ ప్రమాణాలను సమకూర్చుకోవాలని 2021 ఫిబ్రవరిలోనే మూడేళ్ల పాటు సమయం ఇస్తూ జీఓ ఇచ్చారని అన్నారు. నాక్ అక్రిడేషన్ అర్హత సాధించడం వల్ల విద్యా సంస్థలకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావటంతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దండిగా మెరుగుపడతాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 నెలల ఇంటర్న్‌షిప్, నాక్ అక్రిడేషన్ వల్ల విద్యార్థు లకు మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అనంతరం ముఖ్యఅతిథిని ఘనంగా సత్కరించారు.