
భువనేశ్వర్: రాష్ట్రానికి చెందని ప్రముఖ తోలుబొమ్మలాట కళాకారుడు మగుణి చరణ్ కుంవార్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కళారంగంలో విశిష్ట కృషికి ఆయనకు ఈ పురస్కారం లభించడం విశేషం. దేశ రాజధానిలో ఢిల్లీలో బుధవారం ఆట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని స్వీకరించారు. కెంజొహర్‌కు చెందిన ఆయన.. ఒడిశా సంప్రదాయ తోలుబొమ్మల నృత్య రూపకం నిరంతర ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉండడం విశేషం.
ప్రత్యేకాలంకరణలో
వేంకటేశ్వరుడు
జయపురం: పట్టణంలోని వైభవ వేంకటేశ్వవ స్వామివారిని ఉగాది సందర్భంగా పచ్చ కర్పూరంతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఏటా ఉగాది సందర్భంగా ఈ విధంగా అలంకరిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఉరి వేసుకొని
యువకుడి మృతి
మల్కన్‌గిరి: జిల్లా కోరుకొండ సమితి సోమనాథపూర్ పంచాయతీ రంగమ్‌గూడ గ్రామ శివారులో ఉరి వేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రంగమ్‌గూడ గ్రామానికి చెందిన జగన్నాథ బంధామి(35) తనను గుర్తు తెలియని వ్యక్తులు చితకబాది, జేబులోని డబ్బులను ఎత్తుకు పోయారని మంగళవారం మధ్యాహ్నం బలిమెల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై బలిమెల ఐఐసీ జాన్ ఖుజుర్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఘటనా స్థలం తర్లకోట గ్రామానికి వెళ్లి, దర్యాప్తు చేపట్టారు. అయితే జగన్నాథకు మతిస్థిమితం లేదని అక్కడి గ్రామస్తులు తెలిపారు. దీంతో అతనిని నిలదీసిన పోలీసులు.. అనంతరం ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. రోజులాగే బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు.. శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి బలిమెల పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
పాత కక్షలతో బాంబు దాడి
బరంపురం: నగర శివారు లోని కుకుడఖండి బ్లాక్ పరిధి జోగియాపల్లి గ్రామంలో పాత కక్షలతో ఇరువర్గాలు బాంబులతో దాడి చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసుల సహకారంతో ఎంకేసీజీ మెడికల్‌లో భర్తీ చేసి, చికిత్స అందిస్తున్నామని ఐఐసీ చిత్రరంజన్ బెహరా తెలిపారు. గంజాం జిల్లా నిమ్మఖండి పోలీసు స్టేషన్ పరిధిలోని జోగియాపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా ఇరువర్గాల మధ్య రాజుకుంటున్న వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో ఒక వర్గంపై మరొకరు బాంబులు వేసుకున్నారు. ఇందులో కలియా పాత్రొ, మహేశ్వర్ దాస్, బలరామ్ సాహు గాయపడగా, చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పద్మశ్రీ స్వీకరిస్తున్న మగుణి చరణ్ కుంవార్