విజయనగరం టౌన్: సనాతన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని వాగ్దేవీ సమారాధ నం సంస్ధ వ్యవస్థాపకురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక గురజాడ కేంద్ర గ్రంథాలయంలో ఉన్న చా.సో భవనంలో బుధవారం ఉగాదివేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త చివుకుల శ్రీలక్ష్మికి ఉగాది పురస్కారంతో పాటు ‘వాగ్దేవీ సాహితీసుధ’ బిరుదుతో జ్ఞాపికనందించి, దుశ్శాలువ, గజమాలతో సత్కరించారు. కార్యక్రమానికి ముందు కవన విజయం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు వారి కవితలను చదివి వినిపించారు. సద్గురు నిలయం ఉషాకామేశ్వరీ బృందం ఆలపించిన భక్తిగీతాలాపన ఆద్యంతం ఆకట్టుకుంది. నర్తనశాల డైరెక్టర్ డాక్టర్ భేరి రాధికారాణి నృత్యబృందం చేసిన నృత్యప్రదర్శనలు రక్తికట్టించాయి. అనంతరం సేవా, సంగీత, సంప్రదాయ పరిరక్షణ, సాహిత్య, శాస్త్ర, ఆధ్యాత్మిక రంగాల్లో సేవలందించిన డాక్టర్ జ్యోతి ఫెడ్రిక్, రెయ్యి శంకర్ రెడ్డి, ఎం.భీష్మారావు, బంటుపల్లి వెంకటరావు, డాక్టర్ ఎస్. అచ్చిరెడ్డి, మోడేకుర్తి వెంకట కామేశ్వర శర్మ, బులుసు సరోజిని, పాణంగిపల్లి వెంకట నరసింహాచార్యులును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జేబీ తిరుమలాచార్యులు, ఈశ్వర వెంకట రామనాథ శాస్త్రి, పల్లంట్ల వెంకట రామారావు, అనూరాధా పరశురామ్, పెంకి చైతన్య కుమార్, అధిక సంఖ్యలో కవులు, రచయితలు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు.