గన్నవరం: స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని 3(ఏ) ఆర్‌అండ్‌వీ ఎన్‌సీసీ రెజిమెంట్ యూనిట్‌ను ఆంధ్ర, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఎయిర్ కమోడోర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింగ్ సైలాని బుధవారం సందర్శించారు. తొలుత కాకినాడలోని ఎన్‌సీసీ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్‌మోహన్ అగర్వాల్‌తో పాటు వచ్చిన డీడీజీ ఎన్‌సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. రెజిమెంట్‌లో జరుగుతున్న హార్స్ రైడింగ్ శిక్షణ, ఇతర కార్యకలాపాల గురించి డీడీజీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్ల హార్స్ షోను స్వయంగా తిలకించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు చేసిన హార్స్ రైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు డీడీజీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం డీడీజీ నరసింగ్ సైలాని మాట్లాడుతూ.. ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. దేశ రక్షణకు అవసరమైన ఉన్నతమైన నైపుణ్యాలు కలిగిన క్యాడెట్లను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక రెజిమెంట్ యూనిట్ అభివృద్ధిలో ఆధునికీకరణ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. కల్నల్ సి.కె.నాయక్, ఎయిర్ వింగ్ కమాండర్ అజిత్ రాఠి, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.వి.ఎస్.కిషోర్, యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ తీర్థప్రసాద్, అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ డాక్టర్ ఎల్.జయబాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌సీసీ వింగ్ పరిశీలన
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఎన్‌సీసీ ఎయిర్ వింగ్‌ను డీడీజీ నరసింగ్ సైలాని పరిశీలించారు. ఎన్‌సీసీ క్యాడెట్లకు అందిస్తున్న పైలెట్ శిక్షణ, ట్రైనింగ్ విమానాల పని తీరును పర్యవేక్షించారు.