
మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ ఇంజినీరింగ్(వాటర్, పార్కు, వెహికల్ డిపో మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్) కార్మికులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. అర్ధనగ్నంగా మొలలకు వేప కొమ్మలు కట్టుకుని నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి నినాదాలు చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వద్ద మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరుకుంది.
ప్రభుత్వంలో కదలిక..
మున్సిపల్ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా జీతాలు పెంచే విధంగా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులతో విజయవాడ ధర్నా చౌక్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జ్యోతిబసు, నగర కోశాధికారి స్టీఫెన్ బాబు తదితరులు పాల్గొన్నారు.