ఎవరి జేబులోకెళ్లాయో! | - | Sakshi
Sakshi News home page

ఎవరి జేబులోకెళ్లాయో!

Jul 5 2025 5:56 AM | Updated on Jul 5 2025 5:56 AM

ఎవరి

ఎవరి జేబులోకెళ్లాయో!

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంటర్‌ ప్రాక్టికల్‌ ఎగ్జామినర్స్‌కు రెమ్యూనరేషన్‌ నిధులు ఎటు వెళ్లాయో అంతుచిక్కడం లేదు. ఎందుకంటే ఇంటర్‌ బోర్డు అధికారులేమో రెమ్యూనరేషన్‌ ఇచ్చేశామని చెబుతుంటే ఎగ్జామినర్స్‌ అందలేదని స్పష్టం చేస్తున్నారు. ఇంటర్‌బోర్డు అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరుతో అధ్యాపకులు అల్లాడుతున్నారు. గడిచిన రెండేళ్లుగా అధ్యాపకులకు బోర్డు నుంచి రావాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లు ప్రచారం జరుగుతున్నా అధికారులెవరూ నోరు విప్పడం లేదు. వివరాల్లోకి వెళితే ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించిన రెమ్యూనరేషన్లను విధులు నిర్వహించిన అధ్యాపకులకు బిల్లుల చెల్లింపులో రెండేళ్లుగా అనేక అవకతవకలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐపీఈ (ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌) పరీక్షల్లోనూ, సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ప్రయోగ పరీక్షలు తప్పనిసరి. వీటిలో పాల్గొనే ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ ఒకేషనల్‌ ఎగ్జామినర్లకు రెండేళ్లుగా రెమ్యూనరేషన్‌ బకాయి పెట్టారు. జిల్లాలో సుమారు 250 మంది ఎగ్జామినర్లు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి సుమారు రూ.7500 నుంచి రూ.15 వేల వరకు రావాల్సి ఉంది. నగరంలో ఎస్‌ఆర్‌ఆర్‌లో స్పాట్‌, ప్రాక్టికల్స్‌ జరుగుతాయి.

ఒప్పించి ప్రాక్టికల్స్‌ తంతు ముగించేశారు

2024 వృత్తి విద్యాకోర్సుల పరీక్షల బకాయిలు చెల్లిస్తేనే, 2025 సంవత్సరపు ప్రయోగ పరీక్షలు నిర్వహణకు సహకరిస్తామనీ, లేకపోతే బాయ్‌కాట్‌ చేస్తామని అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే విధులకు హాజరు కావాలని బోర్డు అధికారులు ఎలాగోలా ఒప్పించి ప్రాక్టికల్స్‌ తంతు ముగించేశారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా 2024కు సంబంధించి ఏ ఒక్క అధ్యాపకుడికి చెల్లించలేదని వారు చెబుతున్నారు. ఈ ఏడాది సైతం అరకొరగానే చెల్లింపులు జరిగాయని వివరిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలోని కమిషనర్‌ కార్యాలయంలో ఉండే కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సంప్రదించి రాష్ట్రంలో జూనియర్‌ లెక్చరర్లందరికీ న్యాయం చేయాలని విన్నవించినా స్పందన కరువైందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పక్కదారి పట్టాయనే ఆరోపణలు

రాష్ట్రంలో ఇలాంటి అధ్యాపకులు సుమారు 2500 నుంచి 3000 మంది వరకు ఉన్నారు. వీరికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు పెద్దస్థాయి ఉద్యోగులు పక్కదారి పట్టించారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌ బోర్డు అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు తెర తీసిన విధానాలు ప్రస్తుత స్థితికి కారణమని తెలుస్తోంది. గతేడాది మూల్యాంకనం చేసిన అధ్యాపకుల రెమ్యూనరేషన్లు సైతం కొంతమందికి పూర్తిగా చెల్లించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరికి నిధులలేమి కారణం చూపిస్తూ కోత విధించారని తెలిసింది. నిబంధనల మేరకు కేటాయించిన నిధులు ఏమయ్యాయని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.

వృత్తివిద్యా కోర్సుల ఫీజులు గందరగోళం

ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్న మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశ రుసుం విషయంలో ఇంటర్మీడియెట్‌ అధికారులు గందరగోళానికి అవకాశం ఇస్తున్నారు. కమిషనర్‌ ఆదేశాల ప్రకారం వృత్తివిద్యలో చేరిన విద్యార్థులు రెండురకాల లేబొరేటరీ ఫీజులను మాత్రమే చెల్లించాలి. కానీ గ్రూప్‌–డి ల్యాబ్‌ ఫీజు రూ.495 సైన్స్‌ విద్యార్థుల నుంచి మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు, ఒకేషనల్‌ విద్యార్థుల నుంచి కూడా ఆ మొత్తాన్ని కొంతమంది ప్రిన్సిపాళ్లు వసూలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఒకేషనల్‌ అడ్మిషన్లపైనా వ్యతిరేక ప్రభావం చూపుతోందనీ అధ్యాపకులు వాపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం పుస్తకాలు, నోట్సులు, బ్యాగు, ఉచిత భోజనం అందిస్తూ ప్రవేశాలు పెరిగేందుకు కృషి చేస్తుంటే, పేద విద్యార్థులపై అదనపు ఫీజు భారం మోపడం అన్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులబాధ్యతారాహిత్యం ప్రాక్టికల్‌ ఎగ్జామినర్ల రెమ్యూనరేషన్‌బకాయిలపై అధ్యాపకుల ఆగ్రహం రెండేళ్లుగా రెమ్యూనరేషన్‌ఎగ్గొట్టడంపై తీవ్ర విమర్శలు పేద విద్యార్థుల అడ్మిషన్‌ ఫీజులూ అడ్డుగోలుగా వసూళ్లు వృత్తి విద్యా కోర్సుల మొదటి ఏడాది ఫీజులపై ఫిర్యాదు చేసినా స్పందన సున్నా

సమాచారం కోరితే నిర్లక్ష్య సమాధానం

ఒకేషనల్‌ కోర్సులో 2025–2026 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది వృత్తివిద్య గ్రూపులో చేరబోయే విద్యార్థి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెల్లించవలసిన మొత్తం ఫీజు ఎంతో తెలియజేయగలరని ఆర్టీఐ చట్టం క్రింద భీమవరానికి చెందిన కె.శ్రీనివాసరావు సమాచారం కోరారు. గ్రూప్‌–డి ల్యాబ్‌ ఫీజు విషయంలోనూ స్పష్టమైన వివరాలు పంపాలనీ నివేదించారు. దీనికి సంబంధిత హోదాలో ఉన్న అధికారి సమాచారం ఇవ్వ కుండా తిరస్కరించారని తెలిసింది. దీనిపై దరఖాస్తుదారు మళ్లీ బోర్డుకు అప్పీలు చేశారు. దీనిపైనా స్పష్టత కరువైందని దరఖాస్తుదారుడు చెబుతున్నారు.

ఎవరి జేబులోకెళ్లాయో! 1
1/1

ఎవరి జేబులోకెళ్లాయో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement