
సమస్యలపరిష్కారానికి కృషి
కోనేరుసెంటర్: సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కృష్ణా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఆయన పోలీసు దర్బార్ నిర్వహించారు. దీనిలో ఎస్పీ సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసువృత్తి కత్తిమీద సాములాటిదన్నారు. అలాంటి వృత్తిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో మెలగాల్సి ఉంటుందన్నారు. యూనిఫామ్ మన ఐడెంటిటీని తెలియజేస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ప్రధానమైందన్నారు. సివిల్ పోలీసులతో పాటు ఏఆర్ సిబ్బంది విశిష్టమైన సేవలను అందిస్తున్నారన్నారు. మీతో పాటు హోంగార్డులు సైతం పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. సిబ్బంది ఉద్యోగంతో పాటు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు దర్బారులో సిబ్బంది అనేక సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఇతర సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.
కృష్ణా ఎస్పీ గంగాధరరావు