
అగార్ ఉడ్ మొక్కల సాగుతో అధిక లాభాలు
త్రిపుర ప్రభుత్వ ఎన్‌టీఎఫ్‌పీ డైరెక్టర్ ప్రసాదరావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రపంచంలోనే అత్యంత విలువైన చెట్టు అగార్ ఉడ్ అని, దీని సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని త్రిపుర ప్రభుత్వ ఎన్‌టీఎఫ్‌పీ డైరెక్టర్, ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రసాదరావు అన్నారు. విజయవాడ ఎంజీరోడ్డులోని ఓ హోటల్‌లో గురువారం మందిర డెవలపర్స్ ఆధ్వర్యంలో అగార్ ఉడ్‌పై వ్యవసాయ పెట్టుబడితో అధిక లాభాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రసాదరావు మాట్లాడుతూ అగార్ ఉడ్ ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం, మెడిసిన్, సౌందర్య సాధనాలలో విరివిగా వాడుతున్నట్లు తెలిపారు. ఈశాన్య దేశాలలో పెరిగే అగార్ ఉడ్ మొక్కలను గత 10 నుంచి 15 ఏళ్లుగా కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విరివిగా సాగు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమ్మకాలు ఎగుమతులు అన్ని క్లియరెన్సులు అందిస్తూ కొన్ని రూ. వేల కోట్లు బిజినెస్‌ను అంచనా వేస్తూ అగార్ ఉడ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మందిర డెవలపర్స్ చైర్మన్ జీవీ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.