
వయస్సు 24.. చోరీలు 24
మధురానగర్(విజయవాడసెంట్రల్): నాలుగు నెలలో 12 చోరీలు చేసిన నిందితుడు ఉయ్యాల రాజేష్(24)ను గుణదల పోలీసులు అరెస్టు చేసి రూ. 6లక్షలు విలువ చేసే 60గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ డి. దామోదరరావు తెలిపారు. స్థానిక గుణదల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
అలా దొరికాడు..
గుణదల మురళీనగర్ కట్టమీద ఇటీవల చోరీ జరిగింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుణదల పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితులు, నేరస్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందానికి అందిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
జల్సాలకు అలవాటు పడి..
విచారణలో నిందితుడు అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్(24)గా గుర్తించామని ఏసీపీ చెప్పారు. జల్సాలకు అలవాటు పడిన రాజేష్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడ్డాడన్నారు. ఈ క్రమంలో రాజేష్‌పై అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశామని చెప్పారు. 2024 సెప్టెంబర్‌లో దొంగతనం కేసులో గుణదల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించామని తెలిపారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన రాజేష్ నేర ప్రవృత్తి మార్చుకోకుండా చోరీలకు పాల్పడ్డాడని.. నాలుగు నెలల వ్యవధిలో 12 దొంగతనాలు చేశాడని వివరించారు.
సాంకేతిక ఆధారాలు ఆధారంగా..
సాంకేతిక పరిజ్ఞానం, చోరీ జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు పరిశీలించి పాత నేరస్తులతో పరిశీలించగా రాజేష్‌ను నిందితుడుగా గుర్తించామని ఏసీపీ చెప్పారు జరిగిందన్నారు. రాజేష్‌పై ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్‌లలో 12 కేసులు ఉన్నాయన్నారు. గుణదల పోలీస్‌స్టేషన్ పరిధితో పాటు పటమట, రాజోలు, నూజివీడు, నర్సాపురం, నాయుడుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజేష్ చోరీలు చేశాడని వివరించారు. నేరస్తుడుని అరెస్టు చేయటంతో పాటు అతని వద్ద నుంచి రూ.6లక్షలు విలువచేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు.
నాలుగు నెలల్లో 12 దొంగతనాలు ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు రూ. 6లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం