
కార్మికుల సత్తా చాటుదాం
● 9న సమ్మెను విజయవంతం చేద్దాం ● రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పిలుపు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేసి, కార్మిక వర్గ సత్తా చాటుదామని రాష్ట్ర కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, 10గంటల పని విధానాన్ని, అధిక గంటల పని విధానాన్ని, రాత్రి సమయంలో మహిళలు పని చేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. గవర్నర్‌పేటలోని బాలోత్సవ్ భవన్‌లో ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంపల్లి రవీంద్రనాథ్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల, రైతుల, వ్యవసాయ కూలీ చేతివృత్తులు, మహిళా, యువజన, విద్యార్థి రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది.
‘ఉపాధి’లో సంస్కరణలు అవసరం..
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన మార్కెట్ విధానాన్ని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, రుణాలు రద్దు చేయాలని, రైతులకు అన్ని వేదాల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లకు వ్యతిరేకంగా, బీజేపీ దాని అనుబంధ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం సత్తా చాటేందుకు జూలై 9న జరిగే సమ్మెలో కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా నాయకులు వెంకట సుబ్బారావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జల్లి విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, పి.జమలయ్య, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి పాల్గొన్నారు.