
వరి సాగుకు విపత్తు
అవనిగడ్డ: ఖరీఫ్ సాగు ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 40 శాతానికి పైగా విత్తనాలను రైతులకు వారి గ్రామాల్లోనే అందించి ఆదుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పదిశాతం విత్తనాలు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో కృష్ణాజిల్లా రైతులు వరి వంగడాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
అరకొరగా విత్తనాలు
కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్‌లో 1.64 లక్షల హెక్టార్లలో రైతులు వరిసాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఎక్కువగా ఎంటీయూ 1061, బీపీజీ 5204 రకాలను రైతులు సాగుచేస్తారు. గతేడాది ఎంటీయూ 1262, 1318 రకాలను పలుచోట్ల సాగుచేయగా కొనేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం రైతులు ఆ రకాల జోలికెళ్లడం లేదు. సాధారణంగా ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరం. ఈ సీజన్లో 1.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ప్రభుత్వం 10,650 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసింది. దీంతో విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వచ్చిన లోడులు వచ్చినట్టు అయిపోతున్నాయి. రైతులు పనులు మాను కుని గంటల తరబడి ఎదురు చూసినా కొన్ని చోట్ల విత్తనాలు దొరకడం గగనంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 40 నుంచి 45 శాతం విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసింది. అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరో ఐదు శాతం విత్తనాలు సరఫరా చేసింది. ఈ ప్రభుత్వం పదిశాతం మాత్రమే సరఫరా చేయడంతో రైతులు విత్తనాలు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కూడా విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని రైతులు తమకు తామే సర్దిచెప్పుకొన్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే..
కృష్ణాజిల్లాలోని బందరు, కేఈబీ కెనాల్‌కు ఇటీవల సాగునీరు విడుదల చేశారు. గతంలో బోర్ల కింద అక్కడక్కడా రైతులు నారుమళ్లు పోసుకున్నారు. పంట కాలువకు సాగునీరు విడుదల చేయడంతో ఇప్పుడే నారుమళ్లు పోసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఆదిలోనే విత్తనాలకు ఈ విధంగా డిమాండ్ ఉంటే సాగు పనులు ముమ్మరం చేస్తే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 65 శాతం మంది కౌలు రైతులున్నారు. ఏటా పంట చేతికందగానే 85 శాతం కౌలు రైతులు విత్తనాలకు తీయకుండానే ధాన్యం విక్రయిస్తారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడో ఒకచోట విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేయాల్సిందే. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సరిపడా విత్తనాలు ఇవ్వాలి
గత ప్రభుత్వం సబ్సిడీపై అవసరమైనన్ని వరివిత్తనాలు సరఫరా చేసేది. ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. బయట షాపుల్లో రేటు ఎక్కువ. కల్తీ విత్తనాలు వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాల సరఫరా పెంచాలి.
– చిరివేళ్లే యానాదిరావు, పిట్టల్లంక
తనిఖీలు చేస్తున్నాం
అవనిగడ్డ సబ్ డివిజన్‌కు బీపీటీ 5204 రకం 515 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 రకం 154 క్వింటాళ్లు, 1318 రకం 110 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. ప్రస్తుతం వీటిని రైతులుకు సబ్సిడీపై అందిస్తున్నాం. ప్రైవేటు విత్తన షాపులను తనిఖీ చేస్తున్నాం. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
– జయప్రద, ఏడీఏ, అవనిగడ్డ
కృష్ణా జిల్లాలో 1.64 లక్షల హెక్టార్లలో వరిసాగు 1.02 లక్షల క్వింటాళ్ల వరి వంగడాలు అవసరం ప్రభుత్వం సరఫరా చేసింది 11,650 క్వింటాళ్లే.. విత్తనాల కోసం రైతులకు తప్పని ఇబ్బందులు గత ప్రభుత్వంలో 40 శాతానికి పైగా విత్తనాల పంపిణీ

వరి సాగుకు విపత్తు

వరి సాగుకు విపత్తు