
ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాజ్ ప్రియాసింగ్ నేతృత్వంలోని బృందం మంగళవారం పరిశీలించింది. తొలుత రేమల్లె గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు పండ్లతోటల సాగు, బంద్రీ చెరువు పూడికతీత, పశువుల షెడ్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ చానల్ పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడి మొక్కలు పెంచుతున్న రైతు సంగీతరావుతో మాట్లాడారు. సాగు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడిచర్ల గ్రామంలో పంట కుంట, బీటీ రోడ్డు, రజక చెరువులో పూడిక తీత, పశువుల షెడ్డు నిర్మాణం, మ్యూజిక్ సోక్ పిట్ పనులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. పీఎంఏవై–జీ పథకం కింద గ్రామంలో చేపట్టిన గృహ నిర్మాణాలను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద కానుమోలు నుంచి రంగయ్య అప్పారావు పేట, రామ శేషాపురం గ్రామాల మీదగా రామన్నగూడెం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ సీఈఓ కన్నమ్మ నాయుడు, డ్వామా పీడీ శివ ప్రసాద్ యాదవ్, డీఆర్‌డీఏ పీడీ హరహరినాథ్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓ జోగేశ్వరరావు, ఏపీఓ అశోక్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు, పలువురు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.