
దుర్గమ్మకు భక్తుల ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్తబృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు విశేషంగా తరలిరావడం కనిపించింది. ఉదయం నుంచి ప్రారంభమైన సారె సంబరం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఆలయ వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ కుటుంబం అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించింది. నగరంతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు సారె సమర్పించేందుకు తరలివవచ్చారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

దుర్గమ్మకు భక్తుల ఆషాఢ సారె