వైద్యం కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

వైద్యం కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందులు

Jun 27 2025 4:09 AM | Updated on Jun 27 2025 4:09 AM

 వైద్

వైద్యం కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందని ద్రాక్షగా మారింది. వారికి నగదు రహిత వైద్యం అందించే ఈహెచ్‌ఎస్‌ (ఎంప్లా యీస్‌ హెల్త్‌ స్కీమ్‌) సేవలు నిలిచి ఆరు నెలలు దాటింది. ఈ పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం మిథ్యగానే మారింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఏదైనా అనారోగ్యం బారినపడితే అప్పులు చేసి వైద్యం పొందాల్సిన దయనీయ స్థితి నెలకొంది. సుస్తీ చేసిన ఉద్యోగులు ఈహెచ్‌ఎస్‌ కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళ్తే అది చెల్లదని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పేస్తున్నారు. నెలనెలా తమ జీతం నుంచి డబ్బులు మినహాయిస్తున్నా కార్డు చెల్లక పోవడం ఏమిటని అడిగితే.. డబ్బులు ఇస్తేనే వైద్యం, లేదంటే మరో ఆస్పత్రి చూసుకోండని ముఖంపైనే చెప్పేస్తున్నారు. చేసేదేమీ లేక చాలా మంది అప్పులు చేసి వైద్యం పొందక తప్పడంలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సుమారు లక్ష మందికి పైగానే ఉన్నారు. గజిటెడ్‌ ర్యాంక్‌ ఉద్యోగుల నుంచి రూ.400, ఇతరుల నుంచి రూ.225 చొప్పున ఈహెచ్‌ఎస్‌ కింద వారి జీతాల్లో నెలనెలా ప్రభుత్వం మినహాయించుకుంటోంది. నెలకు రూ.2.5 కోట్లకు పైగానే నిధులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రభుత్వానికి సమకూరుతున్నాయి. వైద్య సేవలు అందించడంలో మాత్రం చేతులెత్తేసింది.

ఆరు నెలల నుంచి అందని సేవలు

ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించే ఈహెచ్‌ఎస్‌ పథకంలో వైద్యం చేయలేమంటూ రాష్ట్రంలోని స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గత ఏడాది డిసెంబర్‌లోనే తేల్చి చెప్పారు. దీంతో నాటి నుంచి ఆరోగ్య శ్రీ నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని నిలిపివేశారు. అంతేకాదు గతంలో నిర్వహించిన ఉచిత ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో జిల్లాలోని వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అప్పులు చేయలేక సర్జరీలను సైతం ఆరు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు.

రీయింబర్స్‌మెంట్‌ 50 శాతమే..

ఉద్యోగులు, పెన్షనర్లు డబ్బులు చెల్లించి వైద్యం పొందిన సందర్భంగా ఆ మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్‌ పొందే వెసులు బాటు ఉంది. అయితే ఆస్పత్రిలో అయిన ఖర్చు మొత్తంలో 50 శాతం కూడా రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ ఉద్యోగికి గుండె పోటుతో నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అక్కడ వైద్యానికి రూ.3 లక్షలు బిల్లయింది. రీయింబర్స్‌మెంట్‌ వస్తుందిలే అను కుని అప్పులు చేసి చెల్లించాడు. తీరి బిల్లు పెడితే అతనికి కేవలం 50 శాతం కూడా రాక పోవడంతో అప్పు సగం కూడా తీరని పరిస్థితి నెలకొంది. ఇలా ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి వైద్యం పొందుతూ ఇబ్బందుల పాలవుతున్న వారు కూడా ఎందరో ఉన్నారు.

ఈహెచ్‌ఎస్‌ సేవలు నిలిచి ఆరు నెలలు దాటిన వైనం

అప్పులు చేసి వైద్యం పొందాల్సిన దయనీయ స్థితి

రీయింబర్స్‌కు బిల్లు పెడితే 50 శాతం కూడా ఇవ్వని పరిస్థితి

ఇరిగేషన్‌ శాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు పదిహేను రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఛాతీలో నొప్పిగా ఉంటే విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్ష చేసి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందని, వెంటనే ఆస్పత్రిలో చేరి వైద్యం పొందా లని సూచించారు. తనకు ఈహెచ్‌ఎస్‌ కార్డు ఉందని ఆ ఉద్యోగి చెప్పగా దానిపై వైద్యం చేయలేమని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అర్ధరాత్రి సమయంలోనే మరో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో రూ.3 లక్షలు అప్పు చేసి వైద్యం పొందా ల్సిన పరిస్థితి నెలకొంది.

ఆగిరిపల్లికి చెందిన 65 ఏళ్ల విశ్రాంత ఉద్యోగికి ఇటీవల హార్ట్‌బీట్‌ తగ్గింది. ఆస్పత్రికి వెళ్లగా పేస్‌మేకర్‌ వేయాలని వైద్యులు చెప్పారు. ఒకప్పుడు ఈహెచ్‌ఎస్‌ పథకంలో పేస్‌ మేకర్‌ వేసేవారమని, అయితే ఇప్పుడు ఆ పథకం నిలిచిందని వైద్యులు తెలిపారు. దీంతో రూ.1.80 లక్షలు అప్పుచేసి వైద్యం పొందాల్సి వచ్చిందని ఆ విశ్రాంత ఉద్యోగి పేర్కొన్నాడు. వీరిద్దరే కాదు జిల్లాలోని అందరు ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి ఇలాగే ఉంది.

అమలయ్యేలా చూడాలి

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. ఈహెచ్‌ఎస్‌ కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళితే, ఇది పనికి రాదని డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. మా జీతాల నుంచి డబ్బులు మినహాయిస్తుండగా ఈ పరిస్థితి ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదు. వెంటనే ప్రభుత్వం ఈహెచ్‌ఎస్‌ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి.

– కె.శ్రీనివాసరావు, ఉద్యోగి

 వైద్యం కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందులు 1
1/1

వైద్యం కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement