
దుర్గమ్మకు ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు దుర్గమ్మకు తొలి సారె సమర్పించారు. తొలుత ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు, ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆరో అంతస్తులో వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన ఆలయ అర్చకులు పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, మిఠాయిలు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలు, భక్తుల కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. సారె సమర్పించిన అనంతరం భక్తులు తమ బంధువులు, స్నేహితులకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఏసీ సీహెచ్.రంగారావు, ఏఈఓలు ఎన్.రమేష్‌బాబు, వెంకటరెడ్డి, తిరుమలరావు, జంగం శ్రీనివాస్, కె.గంగాధర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సారె సమర్పించిన హోం మంత్రి
రాష్ట్ర హోం శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఈఓ శీనానాయక్ హోం మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని దర్శించుకున్న హోం మంత్రి పట్టుచీర, పూజా సామగ్రి సమర్పించారు.
సారె సమర్పించిన పలు భక్త బృందాలు
ఆషాఢ మాసం తొలి రోజున అమ్మవారికి పలు భక్త బృందాలు సారె సమర్పించాయి. విజయవాడ చిట్టినగర్‌లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కమిటీ తరఫున అమ్మవారికి సారె సమర్పించారు. తాళ్లాయిపాలెం శివస్వామి, భక్త బృందం అమ్మవారికి సారెను సమర్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారికి సారెను సమర్పించగా, వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి వారాహి నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు గణపతి పూజ, కలశస్థాపన, రుత్విక్ వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ వంటి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై ఆరంభమైన ఆషాఢ మాసోత్సవాలు
తొలి సారె సమర్పించిన ఆలయ ఈఓ దంపతులు
అమ్మకు సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్తులు
వారాహి నవరాత్రుల నేపథ్యంలో పూజలు

దుర్గమ్మకు ఆషాఢ సారె

దుర్గమ్మకు ఆషాఢ సారె

దుర్గమ్మకు ఆషాఢ సారె