
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై గురువారం కలెక్టర్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరి గింది. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు రూపొందించిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు బాలలతో పనిచేయించే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టచేశారు. పనుల్లో గుర్తించిన బాలలను బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో గుర్తించిన బాల కార్మికులకు వృత్తి విద్యాకోర్సులు, ఒకేషనల్ కోర్సుల్లో చేర్పించి వారికి ఆసరా కల్పించాలన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఫ్యాన్ ఇండియా చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన 13 మందికి కనీస వేతనాల చెల్లింపుతో పాటు బాలకార్మిక వ్యతిరేక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సీహెచ్ ఆషారాణి, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రామచంద్రరావు, డెప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ జె.ఇందుమతి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేట్ జి.మహేశ్వరరావు, వాసవ్య మహిళ మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి.కీర్తి, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో ఆర్డినేటర్ అరవ రమేష్, దిశ స్టేషన్ ఆఫీసర్ కె.వాసవి, కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ