సిద్ధార్థ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రామోజీరావు
గన్నవరం రూరల్: పెదవి చీలిక, అంగిలి చీలిక శాపం కాదని చిన అవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ రామోజీరావు అన్నారు. మండలంలోని ముస్తాబాద జెడ్పీ హైస్కూల్లో మంగళవారం ఓరల్ అండ్ మాక్సిలో ఫేషియల్ సర్జరీ విభాగం ఆధ్వర్యాన విద్యార్థులకు గ్రహణం మొర్రిపై అవగాహన కల్పించారు. డాక్టర్ రామోజీరావు మాట్లాడుతూ చిన్నతనంలో ఏర్పడే పెదవి చీలికతో ఆత్మన్యూనతకు గురవుతారని, మిగిలిన వారితో కలసి ముందుకు నడవలేరని చెప్పారు. దీనిని అధిగమించడం ఈ రోజు చాలా తేలికన్నారు. తమ కళాశాలల్లో గ్రహణం మొర్రి ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌వోడీ డాక్టర్ ఎన్.కోటేశ్వరరావు మాట్లాడుతూ చీలిక ఉన్న బాలలను ఆదరించాలన్నారు. అంగిలి చీలిక ఉన్న వారిని చైతన్యపరిచి వారికి ఆపరేషన్ల ద్వారా నూతన జీవితాన్ని అందించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన, ఇబ్బందులను అధిగమించే ప్రక్రియలను డాక్టర్ వసుధ వివరించారు. పెడోడాంటిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ రవిచంద్రశేఖర్, డాక్టర్ నాయుడు, ప్రొఫెసర్ శ్రీకాంత్ గుంటూరు, ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్రీపతి రామ్‌గోపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.