
పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలి
డీసీజీ సమావేశంలో ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రజల భద్రతకు తొలి ప్రాధాన్యమివ్వాల్సిందేనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాల్లో రాజీపడే ప్రసక్తే లేదని, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అప్రమత్తంగా ఉండా లని పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా క్రై గ్రూప్ (డీసీజీ) సమావేశం జరిగింది.
మాక్‌డ్రిల్స్ నిర్వహించండి..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్‌సైట్, ఆఫ్‌సైట్ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా కర్మాగారాలు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, వైద్య ఆరోగ్యం తదితర శాఖలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని తొమ్మిది మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. వాటిల్లో గ్యాస్ లీకేజ్, అగ్ని ప్రమాదాలు వంటివి జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినెలా లెవెల్–1 మాక్‌డ్రిల్స్, ఆర్నెల్లకోసారి లెవెల్–2 మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా తప్పనిసరిగా సేఫ్టీ ఆడిట్ నివేదికలు పంపాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చోళ మండలం ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ సంస్థ రూపొందించిన ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ముసాయిదాపై భాగస్వామ్య పక్షాలు సలహాలు, సూచనలు చేయాలని.. వాటిని పరిగణనలోకి తీసుకొని తుది ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలపై విద్యార్థి దశలోనే అవగాహన పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వ ఐటీఐల్లోని 240 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, కర్మాగారాల డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఎం.శివకుమార్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు తదితరులు హాజరయ్యారు.