తక్షణం విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు బకాయిపడిన ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు తక్షణమే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బందెల నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ పేరిట రూ.6400 కోట్లు బకాయిపెట్టిందన్నారు. టీడీపీ యువగళం పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా కేవలం రూ.600కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కానందున యాజమాన్యాలు వేధిస్తున్నాయని, విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉన్నాయని, విద్యార్థులు ఉన్నత విద్య చదవలేక, మరో పనికి వెళ్లలేక, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
నాలుగో తేదీ నుంచి ధర్నాలు..
బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 4 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కార్తీక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, శరత్, అమర్నాథ్, ప్రణీత్, డేవిడ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.