
నిద్రలేమి.. పట్టదేమి?
లబ్బీపేట(విజయవాడతూర్పు): శరీరానికి శక్తి కోసం ఆహారం ఎంత అవసరమో, మెదడుకు నిద్ర అంత ముఖ్యం. మెదడు సక్రమంగా పనిచేయా లంటే రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. నేటి యువతలో ఎక్కువ మంది నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. విద్యార్థులతో పాటు, యువ ఉద్యోగులు సైతం అర్ధరాత్రి 12 గంటలు దాటే వరకూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి విధి నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్న ఉద్యోగులు విధినిర్వహణపై దృష్టి పెట్టలేకపోతున్నారు. చదివిన అంశాలు గుర్తుండక విద్యార్థులు సతమతమవుతున్నారు. అంతేకాదు వారు పలు శారీరక, మానసిక రుగ్మతలకు గురవు తున్నారని ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది.
మంచి నిద్రపోవాలంటే..
● మనిషి శరీర తత్వాన్ని బట్టి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.
● రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకేసమయానికి నిద్రలేవడం చేయాలి.
● ఒకేసారి ఏకకాలంలో నిద్రపోవాలి. నాలుగు గంటలకు ఒకసారి, రెండు గంటలు మరోసారి కాదు.
● మంచి నిద్రకోసం బెడ్‌రూమ్‌ను చీకటిగా ఉంచుకోవడంతో పాటు, శబ్దాలు లేకుండా చూసుకోవాలి.
● నిద్రలోనే మెదడులోని వ్యర్థాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
● విద్యార్థులకు సరిగా నిద్రలేక పోతే, రాత్రి చదివినవి ఉదయానికి గుర్తుండవు.
ప్రస్తుతం మిడ్‌నైట్ కల్చర్ బాగా పెరిగింది. అర్ధరాత్రి వరకూ రోడ్లమీదే ఎక్కువ మంది గడిపేస్తున్నారు. యువతీయువకులు స్మార్ట్‌ఫోన్లతో అర్ధరాత్రి దాటే వరకూ కాలక్షేపం చేస్తున్నారు. ఫలితంగా తీవ్ర నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిద్రలేమి అనేక ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
యువతపై తీవ్ర ప్రభావం
చూపుతున్న మిడ్‌నైట్ కల్చర్
అర్ధరాత్రి దాటే వరకూ
స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం
ఫలితంగా మానసిక,
శారీరక సమస్యల దాడి
అప్రమత్తం కాకుంటే దీర్ఘకాలిక
సమస్యగా మారే ప్రమాదం
రాత్రివేళల్లో స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ సేపు చూసే వారిలో కంటి లోని మెలకొనిన్ అనే పదార్థం కరిగిపోతుంది. అలాంటి వారికి నిద్రపట్టదు. క్రమేణా నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంది.
నిద్రలేమికి గురయ్యే వారిలో కోపం, చిరాకు పెరిగిపోతాయి. నిస్సత్తువ ఆవహించి, తెల్లారి లేచిన తర్వాత పనిపై దృష్టి పెట్టలేరు. వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు.
పగలు చదివిన అంశాలు మెదడులో నిక్షిప్తం కావాలంటే సరైన నిద్ర అవసరం. నిద్రలేమి సమస్య ఉన్న వారిలో చదివిన అంశాలు గుర్తుండని పరిస్థితి నెలకొంటోంది.
ఒబెసిటీ ఉన్న వారు గురకతో రాత్రి వేళల్లో తరచూ తుళ్లిపడి లేస్తుంటారు. శ్వాసనాళాలు మూసుకుపోవడంతో గురకతో పాటు, ఒక్కోసారి గుండెపోటు, మెదడుపోటుకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితిని స్లీప్ ల్యాబ్‌లో అధ్యయనం చేస్తారు.
ప్రతి ఒక్కరికీ నాన్ రాపిడ్ ఐ మూమెంట్ (ఎన్‌ఆర్‌ఈఎం), రాపిడ్ ఐ మూమెంట్(ఆర్ ఈఐ) అనే రెండు రకాల నిద్ర ఉంటుంది. ఇది గంటన్నరకు ఒకసారి సైకిల్ మారుతుం టుంది. కొందరికి రెండూ కలిసి పోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో నిద్రలోనే లేచి నడవడం వంటివి చేస్తుంటారు.

నిద్రలేమి.. పట్టదేమి?