
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు
ఈగల్ టీం ఐజీ రవికృష్ణ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ టీం ఐజీ ఆరే రవికృష్ణ తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈగల్ టీం సభ్యులు, పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గురువారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా బిహార్ నుంచి చైన్నెకు గంజాయి చాక్లెట్లను తీసుకువెళ్తన్న వ్యక్తిని గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఈ సందర్బంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నా మని తెలిపారు. గంజాయి కేసులకు సంబంధించి 80 శాతం ఒడిశా నుంచే ఇతర ప్రాంతాలకు రైళ్లలో సరఫరా అవుతున్నట్లు గుర్తించామని, దీనిని అరికట్టేందుకు అన్ని రైల్వేస్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సహకారంతో ఈగల్ టీంలు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాయని వివరించారు. డ్రోన్‌లు, శాటిటైట్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను వదిలే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను అటాచ్ చేస్తామని తెలిపారు. భవిష్యత్‌లో కూడా గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఇటువంటి తనిఖీలు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సరిత, రైల్వే సీనియర్ డీఎస్‌సీ షణ్ముగ వడివేల్, జీఆరీపీ డీఎస్‌పీ రత్నరాజు, సీఐలు జి.వి.రమణ, దుర్గారావు, ఆర్‌పీఎఫ్ సీఐ పతే అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు.