సర్పంచ్‌గా పోటీ చేయనివ్వడం లేదు..
ఆర్మూర్: నందిపేట మండలం వెల్మల్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయకుండా తనను గ్రామాభివృద్ధి కమిటీ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ బోగ రాములు అనే వ్యక్తి ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్నాన్ మాల్వియాకు బుధవారం ఫిర్యాదు చేశారు. తమ గ్రామ సర్పంచ్ పదవి ఓపెన్ కేటగిరీ జనరల్ వచ్చిందన్నారు. వీడీసీతో పాటు ఇతర కుల సంఘాల వారు సర్పంచ్ పదవికి ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయాలంటూ తీర్మానం చేశారన్నారు. తాను పోటీలో నిలబడితే తనను బలపర్చిన గ్రామస్తులకు భారీగా జరిమానా విధిస్తామంటున్నారని, డబ్బులు ముట్టజెప్పితే అవకాశం కల్పిస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ తనను భయాందోళనలకు గురి చేస్తున్నారని, విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని రాములు కోరాడు.


