కొడుకు కల నెరవేర్చిన గ్రామస్తులు
● సర్పంచ్‌గా ఏకగ్రీవమైన తల్లి
● అంతకు ముందే ఆస్పత్రిలో
కోమాలో కొడుకు
నవీపేట : తల్లిని సర్పంచ్ చేయాలని కలలు గన్న కొడుకు నామినేషన్‌కు ముందే బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రి పాలై కోమాలోకి వెళ్లాడు. స్పందించిన గ్రామస్తులు మానవతా దృక్పథంలో పోటీదారులను విత్‌డ్రా చేయించి ఆ తల్లిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మొద టి విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని నారాయణ్‌పూర్ సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుడు యెండల నవీన్ తన తల్లి యెండల లక్ష్మి అలియాస్ సరోజనమ్మను బరిలో నిలిపేందుకు ఏర్పాట్లు చేశాడు. గతంలో రెండు పర్యాయాలు యెండల లక్ష్మి సర్పంచ్ స్థానానికి నామినేషన్లు వేయగా, మొదటి సారి ఉపసంహరించుకున్నారు. రెండో సారి స్వల్ప తేడాతో ఓడిపోయారు. మూడోసారి పోటీలో నిలబెట్టి తల్లిని ఎలాగైన సర్పంచ్ చేయా లని భావించిన నవీన్ అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఆ టెన్షన్‌లో నామినేషన్‌కు ఒక రోజు ముందు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైకోమాలోకి వెళ్లాడు. నవీన్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. కొడుకు ఆశయాన్ని నెరవేర్చాలని కొందరు గ్రామస్తులు తల్లితో నామినేషన్ వేయించారు. తరువాత ఇద్దరు బీఆర్‌ఎస్ మద్దతుదారులు, మరొకరు ఇండిపెండ్‌గా నామినేషన్లు వేశారు. నామినేషన్లు ముగిశాక నవీన్ ఆరాటం..దైన్యస్థితిని గమనించిన గ్రామస్తులు ఒక్కటిగా కదిలి ఏకగ్రీవం వైపు మళ్లారు. పోటీలో ఉన్న ముగ్గురి నామినేషన్లను విత్ డ్రా చే యించారు. సర్పంచ్‌గా యెండల లక్ష్మి ఎన్నిక ఏకగ్రీవం ఖరారైంది. తల్లిని సర్పంచ్‌గా చూడా లని కలలు గన్న కొడుకు మాత్రం ఆస్పత్రిలో కోమాలో ఉన్నారు.


