ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
మాక్లూర్/పెర్కిట్/డొంకేశ్వర్/నందిపేట్/డిచ్‌పల్లి: నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ బూత్‌ల వద్ద లోపాలు ఉండకుండా ఏర్పాట్లు చేయాలని, ఎలక్షన్ కమిషన్ నిబంధనలను పాటించాలని జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామ్ ప్రసాద్‌లాల్ అధికారులకు సూచించారు. మూడో విడత నామినేషన్‌ల స్వీకరణ ప్రారంభమైన ఆలూ ర్, ఆర్మూర్, డొంకేశ్వర్, నందిపేట్ తదితర మండలాల్లో బుధవారం వారు పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలూర్ మండలం గుత్పలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, నందిపేట మండలం వన్నెల్(కే), డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఎన్నికల పరిశీలకుడు శ్యామ్‌ప్రసాద్‌లాల్ నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్‌లు వేసే వారికి ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్‌ల ద్వారా నివృత్తి చేయాలని సూచించారు. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ నామినేషన్ కేంద్రాన్ని సీపీ సాయిచైతన్య పరిశీలించారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ క్లస్టర్ కేంద్రంలో నామినేషన్‌ల స్క్రూటినీని శ్యామ్‌ప్రసాద్‌లాల్ పరిశీలించారు.


