బీజేపీ ఓట్ చోరీ చేస్తోంది
● ఎన్నికల కమిషన్, కేంద్రం కలిసి
నాటకమాడుతున్నాయి
● ఓట్ చోరీకి నిరసనగా సంతకాల సేకరణ
● మీడియాతో డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి
డిచ్‌పల్లి: బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వెళ్తూ ఓట్ చోరీ చేస్తూ పలు రాష్ట్రాల్లో అధికారంలో వచ్చిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి ఆరోపించారు. డిచ్‌పల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా ఓట్లు చోరీ చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన ఒక నటికి వివిధ ప్రాంతాల్లో దాదాపు 22 ఓట్లు ఉన్నాయని, ఆమె ఈదేశ పౌరురాలు కానప్పటికీ నకిలీ ఓట్లు సృష్టించి బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. హర్యానాలో దాదాపు 25లక్షల ఓట్లలో సుమారు 12.5శాతం నకిలీ ఓట్లు పోలవడంతోనే బీజేపీ గెలిచిందన్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. అలాగే త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా గెలవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈవీఎంల ద్వారా ఎన్నికల విధానం రద్దు చేయాలని, ఓట్ చోరీకి నిరసనగా సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో అన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షులు సంతకాలు సేకరించి అధిష్టానానికి పంపిస్తారని నగేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు అండగా ప్రజలు..
ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేయాలని కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి విక్కీ యాదవ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్‌గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, డిచ్‌పల్లి మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, చిన్నోల నర్సయ్య, రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లయ్య, శ్రీనివాస్‌గౌడ్, గురడి నర్సారెడ్డి, ఇబ్రహీం, మహేందర్ , డాక్టర్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.


