నామినేటెడ్ ఆశలు నెరవేరేదెన్నడో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపో గా, నామినేటెడ్, పార్టీ పదవుల కోసం సీనియర్ నా యకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా రు. మరోవైపు తమకంటే జూనియర్లకు కీలక పదవు లు దక్కడంపై గుర్రుగా ఉన్నారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నప్పటికీ అధినాయక త్వం గుర్తించకపోవడం పట్ల నిరాశ చెందుతున్నా రు. బాల్కొండ నియోజకవర్గం నుంచి ఏకంగా ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ల పద వులు కేటాయించారు. వారికంటే సీనియర్‌లైన తమకు పదవులు ఇవ్వకుండా నానబెడుతున్నారని ఆగ్రహంగా ఉన్నారు.
● 1988 నుంచి పార్టీకి సేవలందిస్తున్న మార చంద్రమోహన్‌రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్‌రెడ్డి యూత్ కాంగ్రెస్ ఆర్మూర్ మండల అధ్యక్షుడిగా మొదలయ్యారు. అంకాపూర్ సొసైటీ చైర్మన్‌గా, అంకాపూర్ సర్పంచ్‌గా, ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైఎస్‌ఆర్ హయాంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా, టీపీసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఈయన నామినేటెడ్ రేసులోనూ ఉన్నారు.
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి టిక్కెట్టు సాధన, ఆయన గెలుపునకు తీవ్రంగా కృషి చేసిన బాడ్సి శేఖర్‌గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. 1983 నుంచి శేఖర్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌కు పని చేస్తున్నారు. బాడ్సి సర్పంచ్‌గా పదేళ్లపాటు వ్యవహరించారు. ఉమ్మడి నిజామాబాద్ సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, సర్పంచ్‌ల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. తరువాత నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్‌కు అత్యంత సన్నిహితుడు. పార్టీ మారకుండా నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన శేఖర్‌గౌడ్‌కు రాష్ట్ర కార్పొరేషన్ పదవి కేటాయించాల ని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేసిన బాస వేణుగోపాల్ యాదవ్ సైతం కీలకమైన పదవిని ఆశిస్తున్నారు.
● జుక్కల్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడిన గడుగు గంగాధర్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశించగా, తనకు అంతగా ఆసక్తి లేని వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా పదవి ఇవ్వడంపై సంతృప్తిగా లేరు. 1983 నుంచి పార్టీకి సేవలందిస్తున్న గడుగు గంగాధర్ ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. గతంలో దివంగత వైఎస్‌ఆర్ అనుచరుడిగా ఉన్న గడుగు ప్రస్తుతం మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు.
ఇటీవల నగేశ్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో గడుగు చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ లో సీనియర్ కార్యకర్తలను విస్మరిస్తున్నారని, నుడా లో ఏడాదికాలంగా డైరెక్టర్లను నియామకం చేయ కుండా తాత్సారం చేస్తూ కార్యకర్తలకు అన్యాయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఈ విషయమై దృష్టి పెట్టాలని కోరారు.
మీనాక్షి నటరాజన్ వివరాలు సేకరించినా..
గత జూన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పదవులు దక్కని సీనియర్ల వివరాలు సేకరించారు. పార్టీ కోసం కష్టపడినవారికి ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు గాను కసరత్తు చేశారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేతో, ఎమ్మెల్యేలు లేని చోట కీలక నాయకులతో విడివిడిగా మీనాక్షి సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి పదవులకు, నామినేటెడ్ పదవులకు ఎవరు అర్హులు, జిల్లా స్థాయిలో ఎవరిని ఏఏ పదవులకు ఎంపిక చేయాలనే అంశాలపై చర్చించారు. అయినప్పటికీ తమకు నామినేటెడ్ పదవులు కేటాయించడంలో ఆలస్యం చేయడంపై సీనియర్లు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా.. పదవులు దక్కకపోవడంతో పార్టీ
సీనియర్లలో నైరాశ్యం
తమను విస్మరించి జూనియర్లకు
పదవులు ఇవ్వడంపై మనస్తాపం
కీలక పదవుల కోసం రేసులో
శేఖర్‌గౌడ్, మార చంద్రమోహన్‌రెడ్డి, వేణుగోపాల్ యాదవ్


