ప్రత్యేక పిల్లలకు భరోసా.. భవిత!
● జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో
కొనసాగుతున్న సేవలు
● సత్ఫలితాలనిస్తున్న విలీన విద్య
● నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఆర్మూర్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాలు వారి భవిష్యత్‌కు భరోసాను ఇస్తున్నాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆయా కేంద్రాల్లో విలీన విద్యను అందిస్తున్నారు. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత కేంద్రాలపై ప్రత్యేక కథనం.
ఎన్నో సౌకర్యాలు..
జిల్లాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సుమారు 4,860 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి 35 మంది రిసోర్స్ పర్సన్‌లతో పాటు ఇటీవల నియమించబడ్డ 39 మంది స్పెషల్ టీచర్లచే సేవలందిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రతీ మండలంలో ఏర్పాటు చేసిన భవిత కార్యాలయాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు, ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ నిర్వహణ, స్పీచ్ థెరపీ, ఎర్లీ ఇంట్రవెన్షన్ తదితర సేవలను అందిస్తున్నారు. అలాగే పలు మండలాల్లో కొత్తగా భవిత కేంద్రాల నిర్మాణాలతోపాటు పలు మండలాల్లో మరమ్మతులు చేపడుతున్నారు. టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం) కొనుగోలుకు మంజూరు నిధులు సైతం చేసారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, రవాణా భత్యం పుస్తకాలు, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్‌కో) ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్, వీల్ చెయిర్స్, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, సీపీ వాకర్‌లు, కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. చిన్నచిన్న వైకల్యాలు కలిగి ఉన్నవారిని గుర్తించి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు.
నేడు ప్రత్యేక కార్యకమ్రాలు..
జిల్లాల్లోని భవిత కేంద్రాల్లో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి జిల్లా స్థాయి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోను ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడలు, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.
సమగ్ర శిక్ష సహిత విద్యావిభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు కార్యక్రమాలలో విలీన విద్యకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రతీ విద్యార్థి సాధారణ విద్యార్థుల తో సమానంగా పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని స మాజంలో గౌరవంగా నిలబడే విధంగా శిక్షణనిస్తున్నాము.
– అశోక్, డీఈవో,
సర్వశిక్షా అభియాన్ పీవో, నిజామాబాద్
భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను తీర్చి దిద్దడానికి ఐఈఆర్పీల సహకారంతో అన్ని రంగాల్లో శిక్షణనిస్తున్నాము. సాధారణ విద్యార్థులతో పాటు సాధారణ తరగతి గదిలో చదువుకొనేలా శిక్షణనిస్తున్నాము.
– పడకంటి శ్రీనివాస్‌రావు, జిల్లా ఇన్‌చార్జి కోఆర్డినేటర్, సహిత విద్యావిభాగం, సమగ్ర శిక్ష


