రైతుల వెన్ను విరిచేలా విత్తన చట్టం ముసాయిదా
● విత్తన ధరల నిర్ణయం
కంపెనీల చేతుల్లో
● రైతు సంక్షేమ కమిషన్ మెంబర్
గడుగు గంగాధర్
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విత్తన చట్టం ముసాయిదా రైతుల విత్తన హక్కును కార్పొరేట్ పరం చేయబోందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్రం విత్తన చట్ట ముసాయిదాను ప్రజల ముందు ఉంచిందని, ఈ నెల 11 వరకు అభిప్రాయాలు చెప్పాలని కోరిందన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కొత్త విత్తన చట్టం తీసుకవస్తున్నామని కేంద్రం ప్రకటించిందని, నిజానికి ఇది రైతుల నడ్డి విరిచి విత్తన కంపెనీలకు మేలు చేసేవిధంగా ఉందన్నారు. నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల వలన రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే నిబంధనలు ఈ బిల్లులో లేవన్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప విత్తనాల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై చట్టం చేయాలని కమిషన్ సూచిస్తుందన్నారు. విత్తనాలను సాగు చేసే రైతులను ఆదుకోవడానికి ఈ బిల్లులో నిబంధనలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది రైతులు విత్తన సాగు చేస్తున్నారని ఇటీవల కాలంలో వీరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈనేపథ్యంలో ములుగు ప్రాంత గిరిజన రైతులకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చొరవతో రూ. నాలుగు కోట్ల నష్ట పరిహారం ఇప్పించామన్నారు.


