90 రోజుల ప్రణాళిక
● ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని
పెంచేందుకు..
● పెరిగిన హాజరు శాతం
● 75 శాతానికి పైగా సిలబస్ పూర్తి
ఖలీల్‌వాడి: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యా ర్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టిసారించింది. ప్రతి సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అంతగా పెరగటం లేదు. ఈసారి మంచి ఫలితాలు రా బట్టేందుకు 90 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రోజూ సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులను చదివించడంతోపాటు సందేహాలను నివృత్తి చేసేందుకు లెక్చరర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే సిలబస్ 75 శాతం కంటే ఎక్కువగా పూర్తికాగా, మిగితా సిలబస్‌ను త్వరగా పూర్తిచేసి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టారు.
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో మెరుగైన హాజరు...
ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ముఖగుర్తింపు విధానం(ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు తీసుకుంటున్నారు. 70 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆడ్మిషన్ల సమయంలోనే ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. గైర్హాజరైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు లెక్చరర్లు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. దీంతో కాలేజీకి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. నెలకోసారి తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులను చదివించేలా అవగాహన కల్పిస్తున్నారు. దీనికి తోడు ఏకాగ్రత పెరిగేందుకు వారానికి మూడు రోజులపాటు యోగా నేర్పిస్తున్నారు.
ప్రణాళిక అమలు చేశాం
ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 90 రోజుల ప్రణాళిక అమలు చేశాం. రోజుకో సబ్జెక్టు చొప్పున మూడు నెలలపాటు అన్ని సబ్జెక్టులను చదివిస్తాం. నవంబర్ నుంచి పకడ్బందీగా అమలుచేయాలని లెక్చరర్లకు ఆదేశాలు ఇచ్చాం.
– రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్
జిల్లాలో ఇంటర్ కాలేజీలు


