కుల సంఘాల మద్దతు కోసం..
మోర్తాడ్: సర్పంచ్ ఎన్నిక ల్లో అభ్యర్థుల విజయ అవకాశాలపై కుల సంఘాలు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వివిధ కుల సంఘాల పెద్ద మనుషులతో అభ్యర్థులు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల నామినేషన్లు ముగియగా ఈనెల 11న పోలింగ్ జరుగనుంది. అలాగే రెండో విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. మూడో విడతలో నిర్వహించే తంతుకు కూడా నాయకులు సీరియస్‌గానే బరిలోకి దిగుతున్నారు. తాము పోటీ చేసే గ్రామంలో ఏ కుల సంఘం ఓట్లు ఎక్కువగా ఉంటే ఆ కుల సంఘాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలను నాయకులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీలు, మున్నూరుకాపులు, పద్మశాలీలు, గౌడ, ముదిరాజ్, గురడి రెడ్డి, వంజరి, కుమ్మరి, విశ్వబ్రాహ్మణులు, యాదవులు, రజకులు, నాయీబ్రాహ్మణ, వడ్డెర, ముస్లిం ఇతర కులాల వారే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ఇందులో సభ్యులు ఎక్కువగా ఉన్న సంఘాలకు అభ్యర్థులు తాయిలాలను ప్రకటిస్తున్నారు.
సంఘాల భవనాలకు మరమ్మతులు, బోర్ వేయించడం, ఆలయాలు ఉంటే వాటికి పలు సౌకర్యాలు కల్పించడం ఇలా ఎన్నో రకాల హామీలను అభ్యర్థులు ఇస్తున్నారు.
చాలా గ్రామాల్లో కుల సంఘాల పెత్తనం ఇంకా కొనసాగుతుండటంతో ఆ సంఘాల పెద్ద మనుషులను తమవైపు తిప్పుకుంటే విజయం తమదే అనే ధీమాలో నాయకులు ఉన్నారు. కుల సంఘాలకు గాలం వేసి సునాయసంగా విజయం సాధించవచ్చనే భావనలో ఉన్న నాయకులు కుల సంఘాల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా కుల సంఘాల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రంగా ఉండబోతుందని చెప్పొచ్చు.
గ్రామాల్లో మెజార్టీ కులాల పెద్దలతో
సర్పంచ్ అభ్యర్థుల చర్చలు
కుల సంఘాలు మాట ఇస్తే
విజయం సునాయాసం అనే భావన
ఏకగ్రీవంగా మద్దతిస్తే
నజరానా ప్రకటిస్తున్న నేతలు
కుల సంఘాల మద్దతు కోసం..


