ఆరు నెలల్లో పోలీస్ ప్రజావాణికి 352 ఫిర్యాదులు
సుభాష్‌నగర్: నగరంలోని జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య ఆరు నెలలుగా నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 352 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సీపీ సూచనలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుల్లో ప్రధానంగా కుటుంబ తగదాలు, భూ తగదాలు, భార్యాభర్తల తగాదాలు, వివిధ సమస్యలపై వచ్చాయన్నారు.
నిజామాబాద్‌అర్బన్: నేటి నుంచి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నయి. ఇటీవల జిల్లాలో రెండు సంవత్సరాల కాల పరిమితితో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు గత నెలలో మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఎకై ్సజ్ శాఖకు రూ. 83.58 కోట్ల ఆదాయం లభించింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి లాటరీ పద్ధతిన లక్కీడ్రా నిర్వహించారు. కొత్తగా మద్యం దుకాణాలు పొందిన వారిలో 19 మంది మహిళలు కూడా ఉన్నారు. కొందరు పాత వ్యాపారస్తులు మద్యం దుకాణాలు దక్కకపోవడంతో కొత్త వారి నుంచి అధిక డబ్బులు చెల్లించి లైసెన్సులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కామారెడ్డి అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్(ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలైన్స్ టీమ్(ఎస్‌ఎస్‌టీ)ల పాత్ర అత్యంత కీలకమని ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జిల్లాలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు అరికట్టడానికి ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీలు తక్షణ చర్యలు చేపట్టాలని, చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టరేట్‌లోని 21వ నంబర్ గదిలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూమ్‌లను సందర్శించినట్టు పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్‌ను గుర్తించడం, ప్రకటనలకు అనుమతులు జారీ చేయడం, సోషల్‌మీడియాను గమనించడం, ఎన్నికల ప్రవర్తనా నియావళి పర్యవేక్షణ, విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు పారదర్శకంగా జరగాలని ఆదేశించినట్టు చెప్పారు.


