నకిలీ బంగారంతో మోసం
● ముఠాను పట్టుకున్న పోలీసులు
● వివరాలు వెల్లడించిన నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి
సుభాష్‌నగర్: నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ, మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి నగరంలోని తన కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టణం స్వర్ణభారతి కాలనీకి చెందిన తురక శివయ్య, తన్నీరు అంజమ్మ, తన్నీరు అంకమ్మ, తన్నీరు గంగరాజు నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్‌లోని అద్దెకు దిగారు. తమవద్ద ఉన్న మూడు నకిలీ బంగారు బిస్కెట్లను అమ్మేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో సీతారాంనగర్‌లోని మోర వనితకు చెందిన పాలదుకాణానికి తరచూ వెళ్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. నవంబర్ 29న వారి దగ్గర ఉన్న ఒక బంగారు బిస్కెట్‌ను ఆమెకు చూపించి, దాదాపు 350 గ్రాములు ఉందని, బయట అమ్మితే రూ.30లక్షల వరకు వస్తుందని, తమకు కేవలం రూ.10లక్షలు ఇచ్చి తీసుకోవాలని అడిగారు. అంత డబ్బు ఇవ్వలేమని, రూ.5లక్షలు ఇస్తామని వనిత చెప్పగా.. అందుకు ఒప్పుకున్నారు. దీంతో వనితకు నకిలీ బిస్కెట్ ఇచ్చి రూ.5లక్షలు తీసుకొని పరారయ్యారు. వనిత సదరు బంగారాన్ని పరీక్షించగా నకిలీగా తేలింది. వెంటనే బాధితురాలు ఐదో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో ఉన్నారనే పక్కా సమాచారంతో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5లక్షల నగదు, 96 గ్రాముల మూడు నకిలీ బంగారు బిస్కెట్లు, ఫోన్, కీ ప్యాడ్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రెండు గంటల్లోనే పట్టుకున్న నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఐదో టౌన్ ఎస్‌ఐ గంగాధర్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.


