
సంఘ సభ్యుడి మృతి: ఆర్థికసాయం అందజేత
డిచ్‌పల్లి: తమ సంఘంలోని సభ్యుడు మృతిచెందగా, బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించడానికి రూ.3.10లక్షల నగదును అందించింది బహ్రెయిన్ సంఘం. మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన పట్నం చిన్న లక్ష్మణ్ గతంలో బతుకుదెరువు కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లాడు. అక్కడ గ్రామానికి చెందిన వలస కార్మికులతో కలిసి బహ్రెయిన్ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతినెలా డబ్బు జమ చేస్తూ, సంఘ సభ్యుల్లో అవసరమైన వారికి ఇచ్చేవారు. సంఘ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ కరోనా సమయంలో స్వగ్రామానికి వచ్చి, లాక్‌డౌన్ వల్ల తిరిగి వెళ్లలేకపోయాడు. ఈక్రమంలో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి సంఘం సభ్యులందరు జమ చేసిన రూ.3.10 లక్షల నగదు మంగళవారం లక్ష్మణ్ భార్య విజయకు అందించారు.