
నాటి మా రాముని పల్లెనే.. నేటి మారంపల్లి
మీకు తెలుసా?
గోదావరి సమీపంలో ఉన్న మారంపల్లికి తెలుసుకోదగిన చరిత్ర ఉంది. రాముడు గంగానది వెంట పరిక్రమణ చేసినట్లు స్థల పురాణం ఉంది. ఎస్సారెస్పీలో ముంపునకు గురైన పాత కుస్తాపురం శివలింగాన్ని స్వయంగా రాముడే ఇసుకతో తయారు చేసినట్లు చరిత్ర ఉంది. రాముడు తిరిగిన నేల కావడంతో ఆయనపై ప్రేమతో ‘మా రాముని పల్లె’గా నామకరణం చేశారు. కాలక్రమేనా అది మారంపల్లిగా మారింది.
● సుమారు 300 ఏళ్ల క్రితం మా రాముని పల్లెను స్థాపించుకున్నారు. మొదట ఇక్కడ 15 నుంచి 20 ఇళ్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 660 వరకు ఉన్నాయి. వ్యవసాయ భూములు కలుపుకొని ఊరి పూర్తి విస్తీర్ణం సుమారు 1,150 ఎకరాలు.
● ఊరిలో ఒకప్పుడు పెద్ద గడీ ఉండేది. ఈ గడీ గుండానే అప్పటి రాజులు, దొరలు పాలించేవారు. గడీ కూలిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది.
● గ్రామానికి నలుదిక్కులా ఆరు చెరువులు ఉన్నాయి. వాటి పేర్లు సత్తర్‌కుంట, నాంకుంట, చించెరు, పెద్దచెరు, బందం కుంట, కమ్మరి కుంట. వీటిని ఇప్పటికీ ఇలాగే పిలుస్తున్నారు. వానాకాలంలో ఇవి పూర్తిగా నిండి ఊరు ఒక ద్వీపం మాదిరిగా కనిపిస్తుంది.
● ఊరు కళాకారులకు నిలయమని చెప్పవచ్చు. అప్పట్లో నాటకాలు వేయడంలో ప్రసిద్ధులు. నేటి తరం దానిని అందిపుచ్చుకుని ఇప్పుడు భజనలు, కీర్తనలు చేస్తున్నారు.
● 1959లో ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కాగా, 1966లో గ్రామానికి మొదటి సర్పంచ్‌గా కృష్ణారెడ్డి పనిచేశారు.
– డొంకేశ్వర్(ఆర్మూర్)