
భూ సేకరణ, చెల్లింపులు వేగవంతం చేయాలి
● అభివృద్ధి పనుల్లో జాప్యం జరగొద్దు ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల్లో జాప్యం జరగొద్దని, ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియ, చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఐడీవోసీ సమావేశ హాల్‌లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బోధన్–బాసర్–భైంసా రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమికి సంబంధించిన చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. అలాగే ఇతర అభివృద్ధి పనుల కోసం భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతులతో సంప్రదింపులు జరుపుతూ, నష్టపరిహారం నిర్ణయంలో సానుకూల ధోరణిని అవలంభించాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, భూసేకరణపై పెండింగ్‌లో ఉన్న అప్పీల్‌లను వేగంగా పరిష్కరించాలని అన్నారు. వారం అనంతరం భూసేకరణపై మళ్లీ సమీక్ష చేస్తామని, స్పష్టమైన ప్రగతి కనిపించాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు భాస్కర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.