ఎస్సారెస్పీని సందర్శించిన ఆర్మీ బృందం | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీని సందర్శించిన ఆర్మీ బృందం

Jun 29 2025 3:05 AM | Updated on Jun 29 2025 3:07 AM

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ జలాశయాన్ని ఆర్మీ ప్రత్యేక బృందం శనివారం సందర్శించింది. ఆర్మీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నీతూ రామ్‌ ఆధ్వర్యంలోని బృందం ప్రాజెక్ట్‌లోకి ఒకేసారి భారీ వరద వచ్చి ముంపు తలెత్తితే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, బెటాలియన్‌ బృందాలు చేపట్టాల్సిన చర్యలపై పరిశీలించారు. గతంలో ప్రాజెక్ట్‌లోకి వచ్చిన వరదల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌ భద్రతతోపాటు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను ఎలా సురక్షితంగా కాపాడవచ్చో పరిశీలించారు. వారి వెంట ప్రాజెక్ట్‌ ఏఈఈ అక్తర్‌, సిబ్బంది ఉన్నారు.

వ్యవసాయశాఖ మంత్రిని

కలిసిన డీసీసీబీ చైర్మన్‌

సుభాష్‌నగర్‌ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఉమ్మడి నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ కుంట రమేశ్‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందించినందుకు జిల్లా రైతాంగం తరఫున మంత్రికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మంత్రి.. అవసరం మేరకు యూరియాను అందుబాటులో ఉంచుతామని హామీనిచ్చినట్లు చైర్మన్‌ తెలిపారు.

కళాశాల విద్యార్థినులకు హాస్టల్‌ వసతి

నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించినట్లు ప్రిన్సిపల్‌ బుద్ధిరాజ్‌ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కలెక్టర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో నామ్‌దేవ్‌వాడ ప్రాంతంలో ఎస్సీ వసతి గృహంలో వసతి కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మొదటి సంవత్సరం విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్‌ పొందాలని పేర్కొన్నారు.

నిజామాబాద్‌ సీసీఆర్‌బీ ఏసీపీ బదిలీ

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ సీసీఆర్‌బీ ఏసీబీగా పనిచేస్తున్న అంబటి రవీందర్‌రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది డీఎస్పీలు బదిలీలు జరిగాయి. ఏసీపీ రవీందర్‌రెడ్డిని సైబరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీగా బదిలీ అయ్యారు. నిజామాబాద్‌ ఎస్‌బీ సెక్యూరిటీ ఏసీపీగా సత్యనారాయణ బదిలీపై రానున్నారు. ఆయన గద్వాల జిల్లాలో ఎస్‌డీపీవో ఉండగా హైడ్రా ఏసీపీగా పనిచేస్తున్నారు. ఎస్‌బీ ఏసీపీగా పనిచేసిన శ్రీనివాస్‌రావు డీసీపీగా పదోన్నతిపై వెళ్లడంతో కొన్ని రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది.

ఎస్సారెస్పీని  సందర్శించిన ఆర్మీ బృందం 1
1/1

ఎస్సారెస్పీని సందర్శించిన ఆర్మీ బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement