
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
మోపాల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం మోపాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రామేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మి గెలిపించారని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా పూర్తి స్థాయిలో హామీలను అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు పెన్షన్, ఆటో కార్మికులకు రూ.12వేలు, కౌలు రైతుల హామీలు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఉద్యమ పెన్షన్, తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, నాయకులు రవితేజ, గుర్రం రమాదేవి, బొడ్డు సునీత, తదితరులు పాల్గొన్నారు.