
రైతుల నామినేషన్లపై దేశవ్యాప్త చర్చ
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ దేశమంతటికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అందులో 178 మంది రైతులే ఉన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా
ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసి (ఉత్తరప్రదేశ్) స్థానం నుంచి బరిలో నిలిచేందుకు 50 మంది రైతులు తరలివెళ్లారు. 25 మంది నామినేషన్లు వేయగా, వివిధ కారణాలతో 24 మందివి తిరస్కరణకు గురయ్యాయి. ఏర్గట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి ఎన్నికల బరిలో నిలిచారు. నరేంద్ర మోదీపై పోటీలో నిలిచిన ఇస్తారికి 711 ఓట్లు వచ్చాయి.